Miss World Competitions | హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఆతిథ్యమిస్తున్న మిస్ వరల్డ్ పోటీలకు స్పాన్సర్లు ఎవరూ ముందుకురాలేదని తెలిసింది. పోటీల ముగింపు సమయం దగ్గర పడుతున్నా ఒక్క స్పాన్సర్ కూడా ముందుకురాలేదని సమాచారం. పోటీల నిర్వహణకు ప్రభుత్వ వాటాగా ఖర్చు చేయాల్సిన సొమ్ము మొత్తం ప్రజాధనం నుంచే భరించాల్సి వస్తున్నది.
మిస్ వరల్డ్ పోటీలకు సుమారు రూ.54 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 50 శాతం అంటే రూ.27 కోట్ల వరకు మిస్ వరల్డ్ నిర్వహణ సంస్థ భరిస్తుందని, మిగతా సగం ప్రభుత్వం సర్దుబాటు చేస్తుందని అధికారులు వెల్లడించారు. ఇవన్నీ పైకి చెప్తున్న లెక్కలేనని, ఖర్చు చాలారెట్లు ఎక్కువగా ఉంటుందని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ఈవెంట్ నిర్వహణ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
ప్రభుత్వం ఖజానాపై భారం పడకుండా వాణిజ్య సంస్థల సహకారంతో మిస్‌వరల్డ్ పోటీలను అట్టహాసంగా నిర్వహించేందుకు పర్యాటకశాఖ ద్వారా ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిసింది. మే 10 నుంచి 31 వరకు పోటీదారులతో భారీ ఎత్తున కార్యక్రమాల నిర్వహణకు అధికారులు కార్యాచరణ రూపొందించారని సమాచారం. ఏ కార్యక్రమానికి ఎవరిని స్పాన్సర్‌గా ఎంపిక చేయాలి? ఏ మేరకు నిధులు సమీకరించాలి? అని కూడా నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
సదరు వాణిజ్య సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపినప్పటికీ స్పాన్సర్షిష్ చేయడానికి ఏ ఒక్క సంస్థ కూడా ముందుకురాలేదని అధికారులు నిట్టూరుస్తున్నారు. మిస్‌వరల్డ్ పోటీలతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక కేంద్రాలు, చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ప్రాంతాలు, హస్తకళా ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు పరిచయం చేయంతో పాటు తమ సంస్థలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ విద్యా సంస్థలు, ఇతర వ్యాపార వాణిజ్య సంస్థలకు అధికారులు వివరించారు.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వా తావరణం, రాష్ట్రం దివాలా తీసిందని స్వ యంగా సీఎం ప్రకటన చేయటం వంటి కా రణాలతో స్పాన్సర్లు ముందుకు రానట్టు విశ్లేషకులు చెప్తున్నారు. స్పాన్సర్షిప్ చేయటానికి ఎవరూ ముందుకు రాలేదనే విషయం బయటికి వస్తే.. ప్రభుత్వ పెద్దలపై విమర్శలు వస్తాయనే ఆలోచనతో ఫెయిల్యూర్‌ను అధికారుల మీదకు నెట్టుతున్నట్టు సచివాలయం వర్గాలు చర్చించుకుంటున్నాయి. స్పాన్స ర్స్ కోసం ముందుకు వచ్చిన కొన్ని వాణిజ్య సంస్థల ప్ర తినిధులతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే వాళ్లు వెనకి వెళ్లిపోయారంటూ ప్రచారం చేయించి, తమపై నిం దలు వేసేందుకు ‘ముఖ్యనేత’లు రంగం సి ద్ధం చేశారని సందేహంగా ఉందని అధికారులు చెప్తున్నారు.