గోదావరి-కావేరీ అనుసంధానం పేరుతో కేంద్రం, గోదావరి-పోలవరం-బననకర్ల పేరుతో ఏపీ సర్కారు తెలంగాణకు ఆయువు పట్టయిన ప్రాణహిత, ఇంద్రావతి జలాలను చెరబట్టే కుట్రలు చేస్తున్నాయి. ఆ కుటిల ప్రణాళికలకు రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి సర్కారు వంతపాడుతున్నది. ఇచ్చంపల్లికి అంగీకరించడం, బనకచర్ల కోసం కమిటీ ఏర్పాటుకు పూనుకోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది.
‘ఇచ్చంపల్లి కడితే పోలవరం ప్రాజెక్టుకు నీటిలభ్యత ఉండబోదు. గోదావరిలో మిగులే లేదు’.. ఇదీ నిన్నటి వరకు ఏపీ చెప్పిన మాట! కానీ, అకస్మాత్తుగా మిగులు పేరిటే గోదావరి-బనకచర్ల లింక్ చేపట్టింది. గతంలో వ్యతిరేకించిన ఇచ్చంపల్లి ప్రాజెక్టుకూ ఇప్పుడూ పచ్చజెండా ఊపింది. అదే ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఓవైపు కేంద్రం.. మరోవైపు ఏపీ సర్కారు కూడబలుక్కుని ముందుకు సాగుతున్నట్టు తేటతెల్లమవుతున్నది. ప్రాణహితతోపాటు ఇంద్రావతి జలాలనూ చెరబట్టే కుట్రలు అమలు చేస్తున్నట్టు స్పష్టంగా తెలిసిపోతున్నది. ఆ కుట్రల ప్రణాళికలకు రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి సర్కారు వంతపాడుతున్నది. ఇచ్చంపల్లికి అంగీకరించడం, బనకచర్ల కోసం కమిటీ ఏర్పాటుకు పూనుకోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది.
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ఓవైపు గోదావరి-కావేరీ (జీసీ) నదుల అనుసంధానం అంటూ కేంద్రం.. మరోవైపు గోదావరి- పోలవరం-బనకచర్ల (జీపీబీ) లింక్ ప్రాజెక్టు అంటూ ఏపీ ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తున్నాయి. ఆగమేఘాల మీద ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు చుక్కనీటినీ వదులుకోబోమని ఛత్తీస్‌గఢ్ కుండబద్ధలు కొట్టింది. మరి ఏ నీళ్లను తరలిస్తారు? రెండు ప్రాజెక్టులకు మళ్లించేందుకు సరిపడా నీటి లభ్యత ఎక్కడున్నది? అంటే ప్రాణహిత, ఇంద్రావతి జలాలే కళ్లెదుట కనిపిస్తున్నాయి. ఆ రెండు నదుల జలాలను తన్నుకుపోయేందుకే అటు కేంద్రం, ఇటు పొరుగు రాష్ట్రం ఏపీ ఎత్తులు వేస్తున్నాయి. జీసీ, జీపీబీ లింక్ ప్రాజెక్టు అసలు మర్మమిదేనని నీటిరంగ నిపుణులు ఘంటాపథంగా చెప్తున్నారు. తెలంగాణ జలహక్కులకు తీవ్ర విఘాతమని తెలిసినా కేంద్రంలోని మోదీ, ఏపీ చంద్రబాబు అడుగులకు రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు మడుగులు ఒత్తుతున్నది. బనకచర్ల ప్రాజెక్టుకు సై అన్న కాంగ్రెస్ ఇప్పుడు ఇచ్చంపల్లికి కూడా అంగీకారం తెలపడం అందులో భాగమేనని స్పష్టమవుతున్నది.
గోదావరికి రెండు నదులే కీలకం
గోదావరి నది పరీవాహక ప్రాంతాన్ని మొత్తం 12 సబ్ బేసిన్లుగా విభజించారు. అందులో 8 సబ్బేసిన్ల నుంచి గోదావరికి వచ్చే జలాలు 31.95శాతం. ఇక జీ9లోని ఒక్క ప్రాణహిత సబ్‌బేసిన్ నుంచే 26 శాతం జలాలు గోదావరిలో చేరుతాయి. అంటే ప్రాణహితలో ఏమేరకు జలాలు అందుబాటులో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అటు తర్వాత జీ10 సబ్‌బేసిన్ అయిన లోయర్ గోదావరి అంటే ఎస్సారెస్పీ నుంచి పోలవరం వరకు మధ్య గోదావరిలో వచ్చి చేరే జలాలు 7.19 శాతం, జీ11 సబ్బేసిన్లోని ఇంద్రావతి నుంచి 22.93 శాతం జలాలు గోదావరికి వస్తాయి. సూటిగా చెప్పాలంటే గోదావరి నీటిలభ్యతలో ప్రాణహిత, ఇంద్రావతి జలాలే 48.93 శాతం ఉన్నాయి. ఇక ఇంద్రావతి జలాలను అటు ఒడిశా, ఇటు ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలు కూడా వాటా మేరకు వినియోగించుకుంటున్నాయి. ప్రస్తుతం ఒక్క ప్రాణహిత నుంచే నికరంగా జలాలు గోదావరికి వచ్చిచేరుతున్నాయి. ప్రాణహితలో ఏడాదిలో 300 రోజుల పాటు కనీస వరద ప్రవాహాలు కొనసాగుతుంటాయి. ఏ సబ్బేసిన్లోనూ వరద ప్రవాహం మొదలు కాకముందే అంటే వర్షాకాలం ప్రారంభంలోనే ఈ బేసిన్ నుంచి వరద ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రాణహిత జలాల భరోసాతోనే కేంద్రం జీసీ లింక్‌ను, ఏపీ సర్కారు జీబీ లింక్‌ను తెరమీదికి తెచ్చాయని నీటిరంగ నిపుణులు వివరిస్తున్నారు. ఆ ప్రాజెక్టు వెనక అసలు మర్మం ప్రాణహిత, ఇంద్రావతి జలాలను కొల్లగొట్టే కుతంత్రమేనని గణాంకాలతో సహా వివరిస్తున్నారు.
బనకచర్ల భరోసాతోనే ఇచ్చంపల్లికి ఏపీ ఒకే
గోదావరి-కావేరీ లింక్‌పై ఏపీతో ఎన్‌డబ్ల్యూడీఏ 2023లో చర్చలు జరిపింది. ఆ సందర్భంగా గోదావరిలో నీటి లభ్యతే లేదని ఏపీ కరాకండిగా చెప్పింది. గోదావరిలో అసలు మిగులు జలాలే లేవని, అలాంటప్పుడు గోదావరి-కావేరీ లింక్‌ను చేపట్టడం ఎలా సాధ్యమవుతుందని ఏపీనే ప్రశ్నించింది. నీటి తరలింపునకు కొత్త ప్రాజెక్టులు చేపడితే పోలవరం ప్రాజెక్టుపై ప్రభావం పడుతుందని అభ్యంతరమూ వ్యక్తంచేసింది. ఈ విషయాన్ని ఎన్‌డబ్ల్యూడీఏ సైతం స్పష్టంగా తేల్చిచెప్పింది. ఇచ్చంపల్లి నుంచి జీసీ లింక్ ప్రాజెక్టును చేపట్టడాన్ని ఏపీ తీవ్రంగానే వ్యతిరేకించింది. పోలవరం నుంచి చేపట్టాలనే పట్టుబడుతూ వచ్చింది. కానీ అటు తర్వాత మాట మార్చింది. మిగులు జలాల పేరిటనే ఏపీ ప్రభుత్వం ఇటీవల రూ.80 వేల కోట్ల భారీ అంచనా వ్యయంతో పీబీ లింక్ (పోలవరం-బనకచర్ల) ప్రాజెక్టును చేపట్టింది. కేవలం ఈ లింక్ ద్వారానే రోజుకు 2 టీఎంసీలను ప్రకాశం బరాజ్, బొల్లపల్లి రిజర్వాయర్ మీదుగా బనకచర్లలో వేసి పెన్నాబేసిన్‌కు 200 టీఎంసీలను తరలించాలనేది ప్రాజెక్టు లక్ష్యం.
కానీ 300-400 టీఎంసీల మేరకు జలాలను వినియోగించుకునే అవకాశమున్నదని ఏపీనే తన ప్రాజెక్టు ప్రీ ఫీజిబులిటీ రిపోర్టులో (పీఎఫ్ఆర్) వెల్లడించింది. ఇంతభారీ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే ఆ మేరకు జలాలు అందుబాటులో ఉండాలి. మరోవైపు ప్రధాన గోదావరిలో వరద ప్రవాహాలు 70 రోజులకు మించి లేవు. మరి జీబీ లింక్ ఎలా విజయవంతమవుతుంది? ఎందుకు చేపడుతున్నారు? ఏ భరోసాతో అంతమొత్తం వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు? అంటే కేవలం ప్రాణహిత, ఇంద్రావతి నుంచి దిగువకు వెళ్లే జలాలనే లక్ష్యంగా చేసుకొని ముందుకుపోతున్నట్టు స్పష్టమవుతున్నది. అయితే ప్రతిపాదనలను జాతీయ సంస్థలు వ్యతిరేకిస్తున్నా కేంద్రం మాత్రం ఎప్పటికప్పుడు దన్నుగా నిలుస్తున్నది. కేంద్రం ఇచ్చిన భరోసాతోనే తాజాగా ఎన్‌డబ్ల్యూడీఏ నిర్వహించిన సమావేశంలో గత వాదనలన్నింటికీ ఏపీ తిలోదకాలిచ్చింది. నిన్నటివరకు వ్యతిరేకించిన ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు అదే ఏపీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇంతకాలం వ్యతిరేకించిన ఏపీ ఆమోదం తెలపడమే తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రాణహిత, ఇంద్రావతితోనే జీసీ లింక్
నదుల అనుసంధానం ప్రాజెక్టుల్లో ప్రధానంగా గోదావరి-కృష్ణా- పెన్నా- కావేరీ ప్రాజెక్టు ఒకటి. కేవలం ప్రాణహిత, ఇంద్రావతి జలాలను కొల్లగొట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోతున్నది. ఫేజ్-1లో భాగంగా తొలుత వేలాది టీఎంసీల జలాలు అందుబాటులో ఉన్నా బ్రహ్మపుత్ర నదీ జలాలను గంగానదికి మళ్లించాలి. అక్కడి నుంచి దామోదర్, సుబర్ణరేఖ నదుల మీదుగా దాదాపు 390 టీఎంసీల జలాలను మహానదికి మళ్లించాలి. ఒడిశా నీటి అవసరాలు తీరిన తర్వాత ఫేజ్-2లో భాగంగా మహానది నుంచి దాదాపు 234 టీఎంసీల జలాలను గోదావరికి మళ్లించాలి. చివరగా ఫేజ్-3లో భాగంగా గోదావరి నుంచి జలాలను కృష్ణాకు, ఆపై పెన్నా-కావేరీ నదులకు మళ్లించాలి.
ఇదీ వాస్తవ ప్రణాళిక. అయితే మిగులు జలాల తరలింపునకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని ఒడిశా ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రస్తుతం ఫేజ్-1, ఫేజ్-2 రెండింటినీ అటకెక్కించింది. కేవలం ఫేజ్-3 జీసీ (గోదావరి-కావేరీ) లింక్పైనే ప్రస్తుతం ముమ్మర కసరత్తు చేస్తున్నది. ఇదిలా ఉంటే 1989, 2004-05 వాటర్ బ్యాలెన్స్ స్టడీ ప్రకారం ఇచ్చంపల్లి వద్ద 718 టీఎంసీల మిగులు జలాలున్నాయని ఎన్డబ్ల్యూఏ చెప్పింది. ఇక 2015లో ఎన్‌డబ్ల్యూడీఏ వెల్లడించిన నివేదిక మాత్రం ఎస్సారెస్పీ నుంచి ఇచ్చంపల్లి వరకు 177 టీఎంసీలు, ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 148 టీఎంసీలు మొత్తంగా 324 టీఎంసీలే మిగులు ఉంటాయని తేల్చి జీసీ లింక్‌ను ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించింది. అయితే ఎన్‌డబ్ల్యూడీఏ లెక్కలను బేసిన్‌లోని రాష్ర్టాలన్నీ కొట్టిపారేశాయి. మిగులు జలాలు ఉండబోవని స్పష్టం చేశాయి.
దీంతో మళ్లీ మాటమార్చింది. గోదావరిలో చుక్క నీరు కూడా ముట్టుకోబోమని.. ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 148 టీఎంసీలను తొలిదశలో కావేరీకి మళ్లిస్తామని కొత్తపాట అందుకున్నది. అయితే తమ వాటా జలాల మళ్లింపును ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తాజాగా ఎన్‌డబ్ల్యూడీఏ భేటీలో ఛత్తీస్‌గఢ్ కుండబద్ధలు కొట్టి మరీ చెప్పింది. అయినా కేంద్రం వెనకడుగు వేయడం లేదు. ఛత్తీస్‌గఢ్ ప్రాజెక్టులు కట్టుకునేవరకే ఆ జలాలను మళ్లిస్తామని, ఆ లోగా హిమనీ నదుల నుంచి జలాలను తరలిస్తామంటూ కొత్త కథ చెప్తున్నది. ఛత్తీస్‌గఢ్ నీటి వినియోగం ప్రారంభించగానే జీసీ లింక్ ఆపేస్తామని బొంకుతున్నది. కానీ మొత్తంగా ప్రాణహిత, ఇంద్రావతి జలాలను మళ్లించడమే లక్ష్యంగా కేంద్రం జీసీ లింక్ చేపట్టినట్టు స్పష్టమవుతున్నది. అందులో భాగంగానే ఇచ్చంపల్లికి అడ్డుగా ఉన్న మేడిగడ్డను నిర్వీర్యం చేసే కుట్రలు పన్నుతున్నట్టు తెలుస్తున్నది.
కుట్రలకు రేవంత్ సర్కార్ జీహుజూర్
వాటా జలాల్లో చుక్క నీటినీ వదులుకోబోమని బీజేపీ పాలిత ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ర్టాలే తెగేసి చెప్తున్నాయి. తమ వాటా జలాలను వినియోగించుకునేందుకు ప్రాజెక్టులు నిర్మించుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇటీవల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బోధ్‌ఘాట్ ప్రాజెక్టు చేపట్టింది. గోదావరి నుంచి జలాలను మళ్లిస్తే అవార్డు ప్రకారం అందులో హక్కు ఇవ్వాలని మహారాష్ట్ర మెలిక పెడుతున్నది. కర్ణాటక అనేక డిమాండ్లను ముందుపెడుతున్నది. కానీ, రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు మాత్రం తెలంగాణ జల హక్కులపై తేలకుండానే అటు జీసీ లింక్‌కు, ఇటు జీపీబీ లింక్‌కు సై అంటున్నది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు గోదావరి జలాల్లో 968 టీఎంసీల కేటాయింపులున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అందులో ఇప్పటికే 834 టీఎంసీల వినియోగానికి బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులను సిద్ధం చేసింది.
మరో 134 టీఎంసీలను భవిష్యత్తు నీటి వినియోగానికిగాను వివిధ ప్రాజెక్టులు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రాజెక్టులు పూర్తవుతున్నా ఇంకా ఆ మేరకు వాటా జలాల వినియోగం పెరగలేదు. కానీ వాటికి ఎలాంటి రక్షణ కల్పించకుండానే కేంద్రం ముందుకు పోతున్నా రేవంత్ సర్కారు అడ్డుచెప్పడం లేదు. పొరుగు రాష్ర్టాలు తమ వాటా జలాల వినియోగానికి ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధమవుతుంటే తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఉన్న మేడిగడ్డను పడావు పెట్టి అటు కేంద్రం, ఇటు ఏపీ కుట్రలకు వంతపాడుతున్నది. బరాజ్‌లో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక లోపాన్ని బూచిగా చూపి మొత్తంగా ప్రాజెక్టునే కాటగలిపేందుకు ఎత్తులు వేస్తున్నది.
లోపాయికారీ ఒప్పందంతోనే ఇదంతా చేస్తున్నట్టు జోరుగా చర్చ నడుస్తున్నది. అందుకు ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలే సాక్ష్యంగా నిలుస్తాయి. ఏపీ చేపట్టిన జీపీబీ లింక్‌ను బేషరతుగా రేవంత్‌రెడ్డి వ్యతిరేకించింది లేదు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి చర్చలకు సిద్ధమని రేవంత్‌రెడ్డి ప్రకటించడం, ఆ వెంటనే కేంద్రం పిలవడం, ఏపీ సీఎం బాబుతో భేటీ కావడం, సమస్యల పరిష్కారానికి అధికారుల కమిటీ వేసేందుకు అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం ఇచ్చంపల్లి ప్రాజెక్టును నిర్మించి జీసీ లింక్ చేపట్టేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. మొత్తంగా కేంద్రం, ఏపీ ప్రణాళికలకు అనుగుణంగా రేవంత్‌రెడ్డి సర్కారు ముందుకు పోతూ తెలంగాణ జల ప్రయోజనాలను గంగలో కలుపుతున్నదని నీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.