Funtastic | ‘నమస్కారమండి విశ్లేషకుడు గారు.. మీ అసలు పేరే విశ్లేషకుడా?’
‘నమస్కారం! హా.. హా.. భలే అడిగారు. నా అసలు పేరు నేను కూడా మరిచిపోయాను. అందరూ నన్ను టీవీలో కనిపించే విశ్లేషకుడిగానేగుర్తుంచుకుంటారు. మీరూ అలానే పిలవండి.’
‘తెలంగాణ, ఆంధ్ర , కర్ణాటక , ఒడిశా అనే తేడాలేకుండా ఏ రాష్ట్రంలో, ఏ నియోజకవర్గంలో ఎన్నికలైనా మీరు ఫలితాలు చెప్పేస్తుంటారు. మీరు నిరంతరం దేశమంతా తిరుగుతుంటారా?’
‘భలే అడిగారు! ఇప్పుడు ఎండ వేడి ఎంత ఉంది అంటే మీరు సూర్యుడి దగ్గరికి వెళ్లొస్తారా..? లేదు కదా?! ఇక్కడి నుంచే ఉష్ణోగ్రత ఎంత ఉందో చెబుతారు. లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండే సూర్యుడు ఎంత వేడిని పంపుతున్నాడో ఇక్కడే కూర్చొని చెపుతున్నప్పుడు, నాలుగైదు వందల కిలోమీటర్ల దూరంలోని నియోజకవర్గాల రాజకీయ వాతావరణం ఇక్కడి నుంచి చెప్పలేమా? అదోలెక్కా చెప్పండి! అయినా, మనలో మన మా ట… కాళ్ల నొప్పులతో ఇంట్లో నుంచి బయట అడు గు పెట్టడమే నాకు కష్టంగా ఉంది. మా అబ్బాయి క్యాబ్ బుక్ చేస్తాడు. నేరుగా స్టూడియోకు వస్తాను. చర్చ ముగియగానే ఇంటికి వెళ్తాను.
‘రాజకీయ జోస్యాల్లో మీకు ఆదర్శం ఎవరు?’
‘జగడపాటి రామ్‌గోపాల్ … రాజకీయ విశ్లేషణ, రాజకీయ జ్యోతిషం ఒకటే అని నిరూపించింది ఆయనే మరి!’
‘ఎందుకు ఆయన మీకు ఆదర్శం? ఆయన చెప్పిన జోస్యాలు నిజం అవుతాయనా?’
‘కాదు. జోస్యాలకు ఆయన మంచి గుర్తింపు తెచ్చారు. ట్యాంక్‌బండ్ చుట్టు పక్కల చిలకజో స్యం చెప్పేవారిని చూడండి! పావలా తీసుకొని జోస్యం చెబుతూ పూట గడవడానికి తంటాలు పడతారు. కానీ, జగడపాటి ఎన్నికల జోస్యంతో పార్లమెంట్ టికెట్ సంపాదించాడు. ఎంపీగా గెలిచాడు. అలా ఉండాలి జోస్యం అంటే.’
‘మీరు చెప్పిన జోస్యాల్లో పేరు తెచ్చినవి?’
‘తెలంగాణ రాదు అని, 2014లో, 2018 లోనూ గులాబీ పార్టీ గెలవదని.. చెప్పిన జోస్యాలు నాకు బాగా పేరు తెచ్చాయి.’
‘అవన్నీ జరిగాయి కదా!’
‘నా జోస్యం నిజమైందని నేను చెప్పానా? అవన్నీ నాకు మంచి ప్రచారాన్ని తెచ్చి పెట్టాయంతే!’
‘ఈ ఎన్నికలపై మీ జోస్యం చెప్పండి?’
‘షర్మిల సీఎం అవుతుంది.’
‘ఆమె పోటీ చేసేది ఒకటే సీటు కదా?’
‘అది నాకు అనవసరం. ప్రచారమే ముఖ్యం.’
‘మీ జోస్యం నిజం కాదు పందెమా?’
‘నా జోస్యాన్ని నమ్మి ఇతరులు పందెం కాయాలి. నేను నమ్మి పందెం కాయడానికి ఏమై నా పిచ్చోడినా… రాజకీయ విశ్లేషకుడిని …’