భువనగిరి కలెక్టరేట్, మార్చి 25: కన్నవారు, అయినవారు, తోబుట్టువులు, రక్తసంబంధీకులు అనే బంధాల బంధాలను తెంచేస్తూ.. మంచితనాన్ని మంటగలుపుతున్న ప్రస్తుత సమాజంలోనూ మానవత్వం ఎక్కడో ఓ చోట పరిమళిస్తూనే ఉన్నది. అందుకు.. ఓ అనాథ వృద్ధురాలికి అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించిన వృద్ధాశ్రమమే నిదర్శనం.
ఈ ఘటన సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని రాయగిరి సహృదయ అనాథాశ్రమంలో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఖాందేశ్ చంద్రకళ(70)ను సోదరుడు గంగాప్రసాద్ జనవరి 19న రాయగిరిలోని సహృదయ వృద్ధాశ్రమంలో చేర్పించాడు.
అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రకళ ఈ నెల 23న మృతి చెందింది. ఈ విషయాన్ని ఆశ్రమ నిర్వాహకులు యాకూబ్బీ, చోటు దంపతులు మృతురాలి సోదరుడికి ఫోన్ ద్వారా తెలిపారు. వృద్ధురాలి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అతను నిరాకరించడంతోపాటు నిర్లక్ష్యంగా మాట్లాడి సెల్ఫోన్ స్విచ్ఆఫ్ చేశాడు.
వృద్ధురాలి బంధువుల కోసం రెండు రోజులపాటు ఎదురుచూసినప్పటికీ ఎవరూ రాలేదు. చేసేదేమీ లేక ఆశ్రమ నిర్వాహకురాలు యాకూబ్బీ అన్నీ తానైంది. సోమవారం భువనగిరిలోని రాయగిరి శ్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకా రం చంద్రకళ అంత్యక్రియలు నిర్వహించారు. యాకూబ్బీ మతం వేరైనా.. అనాథ వృద్ధురాలికి హిందూ సంప్రదాయం ప్రకా రం అంతిమ సంస్కారాలు చేయడం పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తాయి.