ఎండితే మా ఖర్మే!
‘ఎల్ నినో ప్రభావం కారణంగా ప్రభుత్వం వరి వేయొద్దని చెప్తున్నది. కానీ నాకు వరి మాత్రమే పండుతుంది. కావున నాకు ఇష్టమైన వడ్లను నా సొంత నిర్ణయంతో తీసుకుంటున్నాను.
- పంటల సాగుపై రైతుల నుంచి సర్కార్ అంగీకార పత్రం
- సాగునీళ్లు అందకున్నా, విద్యుత్తు కొరత ఏర్పడినా
- ప్రభుత్వానికి సంబంధం లేదని రాసివ్వాలని నిబంధన
- విత్తనాలు కొనే సమయంలోనే డీలర్ల ద్వారా సేకరణ
- చెప్పినట్టుగానే వరిసాగుపై కత్తిదూస్తున్న కాంగ్రెస్ సర్కార్
- రాష్ట్రంలో ఎకరం కూడా వరి సాగు కాకుండా కార్యాచరణ!
- అందులోభాగంగానే రైతులపై ‘సెల్ఫ్ డిక్లరేషన్’ కొర్రీలు
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : పంటలకు చుక్క నీరు ఇవ్వలేమని తేల్చిచెప్పిన రేవంత్ సర్కార్.. చెప్పినట్టుగానే వరి సాగుపై కత్తి దూస్తున్నది. రాష్ట్రంలో ఒక్క ఎకరం కూడా వరి సాగుచేయకుండా కార్యాచరణ మొదలుపెట్టినట్టు తెలిసింది. యాసంగిలో వరి వేయొద్దన్న ముఖ్యమంత్రి మాటలకు కొనసాగింపుగా వ్యవసాయ శాఖ రైతులపై ‘సెల్ఫ్ డిక్లరేషన్’ నిబంధన విధించడం ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నది.
దీని ప్రకారం.. కరువు కారణంగా పంటకు సాగునీళ్లు అందకపోయినా, విద్యుత్ కొరత ఏర్పడినా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని రైతులు అంగీకరిస్తూ ‘స్వీయ అంగీకార పత్రం’పై రాసివ్వాల్సి ఉంటుంది. రైతులు దీనికి అంగీకరిస్తేనే వరి సాగుకు అనుమతించాలని నిర్ణయించినట్టు తెలిసింది. రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తేనే వరి విత్తనాలు విక్రయించాలనే నిబంధన పెట్టినట్టు సమాచారం. ఆపత్కాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఇలా రైతులను బాధ్యులను చేస్తూ తప్పించుకుంటున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో రైతులపైనే నెపం..
‘ఎల్ నినో ప్రభావం కారణంగా ప్రభుత్వం వరి వేయొద్దని చెప్తున్నది. కానీ నాకు వరి మాత్రమే పండుతుంది. కావున నాకు ఇష్టమైన వడ్లను నా సొంత నిర్ణయంతో తీసుకుంటున్నాను. కరెంట్ కొరత కారణంగా గానీ, సాగు నీళ్ల కొరత కారణంతో గానీ పంట రాకపోతే డీలర్లకు గానీ, ప్రభుత్వానికి గానీ ఎలాంటి సంబంధం లేదు. ఇది నా ఇష్టపూర్వకంగా నేను తీసుకుంటున్న నిర్ణయం. కావున నాకు విత్తనాలు అమ్మగలరని కోరుతూ రాసి ఇస్తున్న సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం’. ఇది సెల్ఫ్ డిక్లరేషన్ ఫారంలో పేర్కొన్న అంశం. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన సాగునీటి కొరత, విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోతే ఆ బాధ్యతను రైతులపైనే నెట్టేందుకు పకడ్బందీ ప్లాన్ చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా భవిష్యత్‌లో రైతులు ప్రభుత్వాన్ని పంటనష్ట పరిహారం డిమాండ్ చేసే అవకాశం లేకుండా కుట్రలు చేస్తున్నది. ఒకవేళ రైతులు డిమాండ్ చేస్తే.. ‘వరి వేయొద్దని మేము ముందే చెప్పినం. ఒకవేళ పంట నష్టం జరిగితే ప్రభుత్వానికి సంబంధం లేదని మీరే డిక్లరేషన్ ఇచ్చారు. కాబట్టి పంట నష్టంతో సంబంధం లేదు, పరిహారం ఇచ్చే ప్రసక్తే లేదు’ అని రైతులకు మొండిచేయి చూపించే అవకాశం లేకపోలేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ‘సెల్ఫ్ డిక్లరేషన్’ నిబంధనపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. వరి సాగు చేయొద్దని చెప్పడమే ప్రభుత్వం చేసిన మొదటి తప్పు అని, ఇప్పుడు పంటలు ఎండిపోతే తమకు సంబంధం లేని చెప్పించుకోవడం మరింత దారుణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
డిక్లరేషన్ ఇస్తేనే వరి విత్తనాలు
యాసంగిలో వరి సాగును పూర్తిగా నియంత్రించేందుకు ప్రభుత్వం దారులను వెతుకుతున్నది. ముఖ్యంగా సాగును ఆదిలోనే కట్టడి చేసేందుకు సెల్ప్ డిక్లరేషన్‌కు వరి విత్తనాల విక్రయానికి లింక్ పెట్టింది. ఈ వానకాలంలో సన్నాల కొనుగోళ్లకు విత్తన డీలర్ల వద్ద ఎలాగైతే రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసిందో అదే విధంగా ఇప్పుడు కూడా వరి విత్తనాల కొనుగోలుకు సెల్ఫ్ డిక్లరేషన్‌ను తప్పనిసరి చేసినట్టు తెలిసింది. ఈ మేరకు వరి విత్తన డీలర్లకు అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఇలా వరి విత్తనాల విక్రయంలోనే కొర్రీలు పెట్టి.. రైతులను వరి సాగు చేయకుండా నిలువరించే కుట్రలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
కరువు తెచ్చిందేగాక.. సాగుపై ఆంక్షలా?
ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శలకు ప్రస్తుత పరిస్థితులు సైతం బలం చేకూర్చుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్‌పై కక్షతో రాష్ట్రం కరువు తీర్చే కల్పవల్లి కాళేశ్వరం ప్రాజెక్టును రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం చేసింది. రైతుల మేలును పక్కనపెట్టి రాజకీయ ఎజెండాతో ముందుకు సాగిన ప్రభుత్వం మేడిగడ్డను రిపేర్ చేయకుండా వదిలేసింది. తత్ఫలితంగా వందల టీఎంసీల నీళ్లు వృథా పోయాయి. ఆ నీళ్లనే ఎత్తిపోసి.. రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలను నింపి ఉంటే ఇప్పుడు ఇలాంటి దుర్భర పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదనే అభిప్రాయాలున్నాయి.
నీళ్ల విషయంలో కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయకుండా సాగునీళ్లకు కరువు తెచ్చిన కాంగ్రెస్.. అదే నిర్లక్ష్యంతో, ముందుచూపులేనితనంతో విద్యుత్ సంక్షోభానికి కారణమైందనే విమర్శలున్నాయి. కరెంట్ అవసరాలు, ఉత్పత్తి అంచనాలపైనా ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకపోవడం గమనార్హం. తీరా కరువు పరిస్థితులు ఏర్పడేనాటికి ఉన్న నీళ్లను కిందికి వదిలేసి ‘ఇప్పుడు నీళ్లు లేవు, కరెంట్ ఉత్పత్తి చేయలేం’ అని చేతులెత్తేసింది. ఇలా ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యం, రాజకీయ కక్షనే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరువుకు కారణమనే విమర్శలు ఉన్నాయి. నీళ్లు, కరెంట్ విషయంలో తప్పు చేసిందే కాక ఇప్పుడు పంటల సాగుపై ఆంక్షలు పెట్టడంపై రైతులు మండిపడుతున్నారు. వరి సాగుకు సంబంధించి సెల్ఫ్ డిక్లరేషన్ నిర్ణయంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదేండ్ల తర్వాత తమకు కరువును పరిచయం చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని నిప్పులు చెరుగుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

