China | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): రెండేండ్ల కిందట ఇజ్రాయెల్-పాలస్తీనా దేశాల మధ్య జరిగిన ఘర్షణలు గుర్తున్నాయా? హమాస్ ఉగ్రవాదులు ప్రయోగించిన రాకెట్లు, డ్రోన్లు, యుద్ధవిమానాలు, క్షిపణులను గాల్లోనే తునాతునకలు చేసిన ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్ లేజర్ వ్యవస్థ’ పనితీరు చూసి యావత్తు ప్రపంచం అబ్బురపడిపోయింది కదా! అలాంటి డోమ్‌ను సైతం తలదన్నే విధ్వంసకర లేజర్ ఆయుధాన్ని చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన లేజర్ వెపన్‌గా దీన్ని చెబుతున్నారు. రక్షణరంగంలో కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకొంటున్న చైనా చేతికి సరికొత్త లేజర్ ఆయుధం వచ్చిచేరింది. భవిష్యత్తు యుద్ధాల తీరుతెన్నులను ఇది పూర్తిగా మార్చివేస్తుందని అక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఏమిటీ లేజర్ వ్యవస్థ?
శత్రు క్షిపణులను, రాకెట్లను, డ్రోన్లను లేజర్ కిరణాలతో కూల్చేయడం తెలిసిందే. అయితే, ఈ లేజర్ ఆయుధాలను కొంత సమయం పాటే వినియోగించి విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది. వీటి పరిధి కూడా తక్కువ. అయితే, వీటికి భిన్నంగా నిర్విరామంగా ఎంత దూరమైనా ప్రయాణించి లక్ష్యాలను ఛేదించే లైజర్ ఆయుధాన్ని చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
ఎలా పనిచేస్తుంది?
లేజర్ ఆయుధాలు వినియోగంచే సమయంలో పెద్దమొత్తంలో వేడి ఉత్పత్తి అవుతుంది. దీంతో లేజర్ వ్యవస్థపై ఒత్తిడిపడి సాంకేతిక సమస్యలు తలెత్తవచ్చు. అందుకే, లేజర్ ఆయుధాలను ఇప్పటివరకూ కొంత దూరంలోని లక్ష్యాలను నాశనం చేయడానికి అదీ కొంత సమయంపాటే (నిమిషాల్లోనే) ప్రయోగిస్తున్నారు. దీనికి చెక్ పెట్టేలా.. చైనాలో చెంగ్షూలోని ‘నేషనల్ డిఫెన్స్ టెక్నాలజీ’ శాస్త్రవేత్తలు స్వదేశీ పరిజ్ఞానంతో ‘సరికొత్త లేజర్ వెపన్’ను అభివృద్ధి చేశారు. ఎలాంటి ఉష్ణ సమస్యలు లేకుండానే ఈ లేజర్ ఆయుధం తన కిరణాలను ఎంతదూరమైనా నిరాటంకంగా ప్రసరింపజేయగలదు. మెషిన్‌కు విశ్రాంతినివ్వాల్సిన పని కూడాలేదు. లేజర్ వ్యవస్థపై ఒత్తిడి పడకుండా శాస్త్రవేత్తలు ఇందులో ప్రత్యేక కూలింగ్ సిస్టవ్‌ును అభివృద్ధి చేశారు. ఈ కూలింగ్ సిస్టవ్‌ు.. హైఎనర్జీ లేజర్ వేడెక్కకుండా అడ్డుకోవడంతోపాటు అవసరమైన శక్తిని అందిస్తుందని వాళ్లు తెలిపారు.