Errolla Srinivas | అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని అమెరికాలో హరీశ్‌రావు ప్రకటిస్తే తెలంగాణలో కాంగ్రెస్ నేతల కూసాలు కదులుతున్నాయని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ఫ్యూచర్ సిటీ పేరు మీద కాంగ్రెస్ నేతలు తమ అవినీతి సౌధాలను పటిష్టం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని తెలిపారు. హరీశ్‌రావు వ్యాఖ్యలు దానికి గండికొడుతున్నాయన్న భయంతో ఉలిక్కి పడుతున్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ఫార్మాసిటీ ఏర్పాటుకు సమీకరించిన భూములను అధికారం అప్పగిస్తే రద్దు చేసి రైతులకు అప్పగిస్తామని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. అధికారం చేతికి చిక్కాక ఫ్యూచర్ సిటీ పేరుతో ఫార్మూ భూములను కొల్లగొట్టే ప్రయత్నాల్లో పడ్డారని అన్నారు. కాంగ్రెస్ నేతల దోపిడి కోసమే ఫ్యూచర్ సిటీ అని విమర్శించారు. ఫార్మా సిటీ కోసం సమీకరించిన భూములు ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కోసం వాడుకోవడం చెల్లదు గనక హరీష్ రావు గారు దానిని రద్దు చేస్తాం అని ప్రకటించారని తెలిపారు. అధికారం పోతే మళ్లీ రాదు అని అడ్డికి పావుశేరు కింద అడ్డగోలుగా తెలంగాణను అమ్ముకుంటున్నారు .. అందిన కాడికి దోచుకుంటున్నారని మండిపడ్డారు.
ఫార్మా సిటీ ఏర్పాటు కోసం తీసుకున్న భూములు ఇతర అవసరాల నిమిత్తం వాడుకోవద్దు అన్న ప్రాథమిక సూత్రం తెలియని పొంగులేటి ఈ రాష్ట్ర మంత్రి కావడం దౌర్భాగ్యమని ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనుమతులు లేకుండా మైనింగ్ చేసి అడ్డగోలుగా దోచిన చరిత్ర పొంగులేటిది .. అసైన్డ్ భూములను కబ్జా చేసిన చరిత్ర పొంగులేటిది అని విమర్శించారు.
హైదరాబాద్ మెట్రో గురించి మంత్రి పొంగులేటి మాట్లాడటం హాస్యాస్పదం అని విమర్శించారు. హైదరాబాద్ మెట్రోను నిలబెట్టింది బీఆర్ఎస్ .. నిండా ముంచి అప్పులు తెలంగాణ మీద రుద్దింది కాంగ్రెస్ అని అన్నారు. ఆలూ లేదు చూలు లేదు .. కొడుకు పేరు సోమలింగం అని ఫ్యూచర్ లేని సిటీకి మెట్రో రైలు అని కాంగ్రెస్ ఊదరగొడుతుందని విమర్శించారు. రాఘవ కన్ స్ట్రక్షన్ నాది కాదు .. నాకు సంబంధం లేదు అన్న పొంగులేటికి వేల కోట్ల కాంట్రాక్టులు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని కేకు ముక్కల్లా కోసి పంచుకుంటున్నారని ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. మూసీని బాగుచేస్తాం, లగచర్లలో ఇండస్ట్రీ పెడతాం అని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. కాంగ్రెస్ కు మళ్లీ అధికారం దక్కుతుందని పొంగులేటి పగటి కలలు కంటున్నాడని అన్నారు. కాంగ్రెస్ కు ఇదే ఆఖరి అవకాశం అని తెలిసే దోపిడీకి తెగబడ్డారని అన్నారు. అధికారం పోయాక అవినీతి, దోపిడీలకు పాల్పడిన కాంగ్రెస్ నేతలకు శ్రీకృష్ణ జన్మస్థానంలో ఊచలు లెక్కపెట్టక తప్పదని హెచ్చరించారు.అధికారం ఉందన్న అహంకారంతో పొంగులేటి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని అన్నారు. ప్రజాగ్రహంలో కాంగ్రెస్ గల్లంతు ఖాయం .. పొంగులేటి రోజులు లెక్క పెట్టుకుంటూ మిగిలిన పదవీకాలం వెళ్లదీసుకోవాల్సిందే అని స్పష్టం చేశారు.
2023 నవంబర్ 9,10 తేదీల్లో ఐటీ శాఖ ఆయన ఇంటి మీద, కార్యాలయాల మీద దాడులు చేసింది. ఖమ్మం, హైదరాబాద్‌లోని మీ నివాసం, రాఘవ ప్రైడ్ ఇన్ఫ్రా కార్యాలయం, మీ సోదరుడి ఇల్లు, ఇతర కార్యాలయాలతో కలిపి మొత్తం 5-6 స్థలాలలో సోదాలు జరిగాయి
2024 సెప్టెంబర్ 27న ఈడీ 16 బృందాలతో హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని మీ నివాసం, ఫామ్‌హౌస్ (హిమాయత్ సాగర్), రాఘవ కన్స్ట్రక్షన్స్ కార్యాలయాలు (బంజారా హిల్స్) మీద దాడులు చేసి సోదాలు చేసింది. మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ ఈడీ ఇప్పటి వరకు కేసులు పెట్టినట్లు గానీ, ఎవరినైనా అరెస్టు చేసిన దాఖలాలు గానీ లేవు. దాని వెనక మతలబు ఏంటి ?
మీ కుమారుడు పొంగులేటి హర్షరెడ్డి నడుపుతున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద జీఓ 111 నిషేధిత ప్రాంతంలో, కొత్వాల్ గూడ (శంషాబాద్), మానస హిల్స్ (రాజేంద్రనగర్) లో అక్రమ మైనింగ్, క్రషర్ యూనిట్లు నడుపుతున్నది వాస్తవమే కదా. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్కడ దోచుకున్నది నిజం కాదా ? అది బయటపడగానే స్వయంగా ప్రభుత్వం హైడ్రా పేరుతో దానిని ధ్వంసం చేసింది వాస్తవం కాదా ?
2025 డిసెంబర్లో గచ్చిబౌలి/వట్టినగులపల్లి ప్రాంతంలో భూమి కబ్జా ప్రయత్నం చేయడంతో కేసు నమోదు అయింది వాస్తవం కాదా ? ఎఫ్ఐఆర్ లో రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరు ఉన్నది వాస్తవం కాదా ? ఎక్స్కవేటర్లతో గోడలు కూల్చడం, బెదిరింపులు చేసింది నిజం కాదా ?
2026 మార్చిలో సతీష్ షా కుటుంబానికి చెందిన రూ.1400 కోట్ల విలువైన 27 ఎకరాల భూమి మీ కుమారుడు హర్ష రెడ్డి ప్రయత్నించింది నిజం కాదా ?
మీ కుమారుడు హర్షరెడ్డి మీద 2024లో రూ.1.7 కోట్ల విలువైన లగ్జరీ వాచీల స్మగ్లింగ్ కేసులు నమోదు అయింది నిజం కాదా ? దీనిపై హవాలా ? క్రిప్టో లావాదేవీలు నిజం కాదా ?
అధికారాన్ని అడ్డుపెట్టుకొని పొంగులేటి అక్రమాలకు పాల్పడుతూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు
చివరిగా పొంగులేటికి ఒక చెప్పదల్చుకున్నాం .. అధికారం ఉంది కాబట్టి మీ అవినీతి, అక్రమాలు దాగవచ్చు . ఈ ప్రభుత్వం దాచి ఉంచవచ్చు .. కానీ రేపు అధికారం పోయాక మీ అవినీతి సామ్రాజ్యం పేకమేడలా కూలుతుందన్న సంగతి గుర్తుంచుకోవాలని హితవు పలికారు.