హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : మీరు ఎప్‌సెట్‌కు కొత్తగా దరఖాస్తు చేస్తున్నారా..? రాష్ట్రంలో ఎక్కడివారైనా హైదరాబాద్‌కు పరుగెత్తాల్సిందే. ఆపసోపాలు పడుకుంటూ హైదరాబాద్‌లో పరీక్ష రాయాల్సిందే. ఎప్సెట్లోని 12 టెస్ట్ జోన్లను జేఎన్టీయూ అధికారులు బ్లాక్ చేశారు. ఈ 12 టెస్ట్ జోన్లల్లో సెంటర్ల సామర్థ్యం మేరకు దరఖాస్తులొచ్చాయి. దీంతో కొత్తగా దరఖాస్తు చేసే వారికి ఆయా టెస్ట్జోన్లల్లో సెంటర్లు కేటాయించలేని పరిస్థితి నెలకొన్నది. ఎప్‌సెట్‌కు కొత్తగా ఎవరు దరఖాస్తు చేసినా హైదరాబాద్‌లోనే సెంటర్లను కేటాయిస్తారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్‌లో సెంటర్ల కేటాయింపు సమస్యగా మారింది. జిల్లాల నుంచి భారీగా దరఖాస్తులు రావడంతో ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహించే సెంటర్లు హౌజ్‌ఫుల్ అయ్యాయి. దీంతో శనివారం వరకు రాష్ట్రంలోని 12 టెస్ట్ జోన్లను జేఎన్టీయూ అధికారులు బ్లాక్ చేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసే వారికి ఈ టెస్ట్ జోన్లు అందుబాటులో లేకుండా చేశారు. ఈ జోన్లల్లో సెంటర్ల సామర్థ్యం తక్కువగా ఉండటం, ఇప్పటికే దరఖాస్తులు భారీగా రావడంతో ఆయా టెస్టు జోన్లను బ్లాక్‌చేశారు. తాజా సమాచారం ప్రకారం ఒక్క హైదరాబాద్ మినహా ఎక్కడా సెంటర్లు కేటాయించలేని పరిస్థితి నెలకొన్నది.
సామర్థ్యం పెంపునకు ప్రయత్నాలు..
టెస్ట్ జోన్లను బ్లాక్ చేయాల్సి రావడం, ఇంకా దరఖాస్తు చేసుకునే అవకాశముండటంతో టెస్ట్ సెంటర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఏప్రిల్ 4 వరకు ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేసే అవకాశమున్నది. రూ. 250 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 9, రూ. 500తో ఏప్రిల్ 14, రూ. 2,500తో ఏప్రిల్ 18, రూ. 5వేలతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసే అవకాశమున్నది. పైగా ఇంటర్ వార్షిక పరీక్షలు ముగిశాయి. దీంతో దరఖాస్తులు పెరగనున్నాయి. సెంటర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు జేఎన్టీయూ అధికారులు ప్రయత్నిస్తున్నారు. శనివారం వరకు ఎప్‌సెట్‌కు 1,75,991 దరఖాస్తులొచ్చాయి. ఇంజినీరింగ్‌లో 1,27,758, అగ్రికల్చర్, ఫార్మసీకి 48,115, రెండింటికి హాజరయ్యేందుకు 118 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారు.
బ్లాక్ చేసిన ప్రాంతాలు
నర్సంపేట, హసన్‌పర్తి, హనుమకొండ, వరంగల్, నిజామాబాద్, ఆర్మూర్, ఆదిలాబాద్, నర్సాపూర్, సుల్తాన్పూర్, పటాన్చెరు, రుద్రారం, జగిత్యాల, కరీంనగర్, హుజురాబాద్, మంథని, సిద్దిపేట, నల్లగొండ, కోదాడ, సూర్యాపేట, ఖమ్మం, పాల్వంచ, సుజాతనగర్, సత్తుపల్లి, మహబూబ్‌నగర్.