హైదరాబాద్ ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్ (శక్తి)లో విలీనం చేసి పేద విద్యార్థుల భవిష్యత్‌ను బలిపెట్టవద్దని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు, పడాల సతీశ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. వెంటనే జీవో 97ను రద్దుచేయాల్సిందేనని తేల్చిచెప్పారు. లేదంటే విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్ పోరాటానికి ఉపక్రమిస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఆగస్టు 15న జీవో 97 తెచ్చి ప్రతిభావంతులైన పాలిటెక్నిక్ విద్యార్థులను గందరగోళంలోకి నెట్టిందని ధ్వజమెత్తారు. ఆ జీవో రద్దు చేయాలని పది రోజులుగా విద్యార్థులు పోరాడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
ప్రభుత్వం రెండేండ్ల క్రితం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఏఐసీటీఈ గుర్తింపు ఎక్కడిదని వినోద్‌కుమార్ ప్రశ్నించారు. కేవలం యూజీసీ గుర్తింపు ఉన్న వైఐఎస్యూకు డిగ్రీ పట్టాలు మాత్రమే ఇవ్వొచ్చు..మరీ పాలిటెక్నిక్ విద్యార్థులకు డిప్లొమా సర్టిఫికెట్లు ఎలా ఇస్తుందని నిలదీశారు. అలాగే పీపీయూ విధానంలో పనిచేస్తుందని చట్టంలో చెప్పారని గుర్తుచేశారు. దీనిపై పాలిటెక్నిక్ స్టూడెంట్స్‌కు అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. కార్మికశాఖ మంత్రి వివేక్ వారి సందేహాలను నివృత్తి చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. స్కిల్ యూనివర్సిటీ యాక్ట్..జీవో 97 పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీకి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను కొనసాగిస్తూనే స్కిల్ యూనివర్సిటీని కొనసాగించవచ్చని స్పష్టంచేశారు.
పాలిటెక్నిక్ విద్యార్థులను డిప్లొమాకే పరిమితం చేయాలని, ఈసెట్ రాసే అవకాశం ఇవ్వొద్దని చెప్పే హక్కు విద్యాకమిషన్ చైర్మన్‌గా వ్యవహరించిన ఆకునూరి మురళికి ఎక్కడిదని నిలదీశారు. విద్యార్థులను చదువు బంద్ చేయమనే అధికారం ముఖ్యమంత్రి రేవంత్ సహా ఎవరికీ లేదని పునరుద్ఘాటించారు. ఇప్పటికైనా కార్మిక మంత్రి పాలిటెక్నిక్ విద్యను శక్తిలో విలీనం చేసే విషయమై లోతుగా ఆలోచించాలని, ముఖ్యమంత్రి వెంటనే జీవో 97పై అధికారులతో సమీక్షించాలని డిమాండ్ చేశారు. తప్పుడు నిర్ణయాలతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌ను పణంగా పెడితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. ప్రభుత్వం శక్తి పేరిట కుట్రలు ఆపకుంటే విద్యార్థుల తరఫున పోరాటాన్ని ఉధృతం చేస్తామని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ప్రకటించారు. జీవో 97పై ప్రభుత్వం దిగిరాకుంటే ఈ నెల 26న ఉత్తరాల ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరించారు. ఈ నెల 31వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పిస్తామని స్పష్టంచేశారు.