హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ టీచింగ్ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయోపరిమితిని 65 నుంచి 70 ఏండ్లకు పెంచొద్దని ఫ్యాకల్టీగా పనిచేస్తున్న మెజారిటీ వైద్యులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ నిర్వహించిన వాట్సాప్ ఒపినియన్ పోల్లో వెయ్యి మంది టీచింగ్ డాక్టర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇందులో 921 మంది(92.1%) ప్రభుత్వ ప్రతిపాదనను ఖండించారు. 61 ఏండ్ల తర్వాత ఉద్యోగ విమరణకు అవకాశం కల్పించాలని 61 మంది వైద్యులు సూచించారు. టీటీజీడీఏ అధ్యక్షుడు డాక్టర్ బీ కిరణ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం కిరణ్ సర్వే వివరాలు వెల్లడించారు. గతంలో 58 నుంచి 65 ఏండ్లకు వయోపరిమితి పెంచారని వైద్యులు గుర్తుచేశారు. మరోసారి వయసు పెంచితే యువ వైద్యులకు ఉద్యోగోన్నతుల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోయారు. ప్రభుత్వ ప్రతిపాదనతో తమకు అన్యాయం జరుగుతుందని ఐదు నెలల్లో సీనియర్ రెసిడెంట్లు కానున్న 1,400 మంది ఆందోళన వ్యక్తంచేశారు.