చేర్యాల, అక్టోబర్ 8 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. అదివారం కొమురవెల్లి క్షేత్రానికి 8వేల మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ ఈవో అలూరి బాలాజీశర్మ తెలిపారు. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు రాతిగీరలు వద్ద ప్రదక్షణలు, కోడెల స్థంబం వద్ద కోడెలు కట్టి పూజలు నిర్వహించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు.