హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజనకు ముందు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్(ఐఎన్‌సీ)లో నర్సులుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి తాజా రెన్యువల్ ప్రక్రియ గందరగోళంగా మారింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రెన్యువల్ చేసుకున్నవారి వివరాలు ఇక్కడి నర్సింగ్ కౌన్సిల్లో నమోదు కాగా.. తెలంగాణ ఏర్పాటుకు ముందు రెన్యువల్ చేసుకున్నవారి వివరాలు ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో నమోదయ్యాయి. దీంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నర్సింగ్ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు వెంటనే తమ సర్టిఫికెట్లను నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగం పొందిన తర్వాత వారు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో ఆ సర్టిఫికెట్లు చూపించాల్సి ఉంటుంది. వాటిని నర్సింగ్ కౌన్సిల్ పరిశీలించి ఆ అభ్యర్థులకు రిజిస్టర్డ్ నర్సులు, మిడ్-వైఫరీలుగా రిజిస్ట్రేషన్ నంబర్లు జారీ చేస్తుంది. ఆ నర్సులంతా తమ నర్సింగ్ సర్టిఫికెట్లను ప్రతి ఐదేండ్లకోసారి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్‌సీ)లో రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా రెన్యువల్ చేసుకున్న నర్సులకు ఐఎన్‌సీ నేషనల్ యూనిక్ ఐడెంటిటీ నంబర్ (ఎన్యూఐడీ)ని జారీచేస్తుంది.
ఈ రెన్యువల్ ప్రక్రియ జరిగితేనే వారు చట్టబద్ధంగా నర్సు ఉద్యోగంలో కొనసాగేందుకు వీలవుతుంది. కానీ, ఐఎన్‌సీ 2017లో ఎన్యూఐడీ కార్డులను ప్రవేశపెట్టడంతో 2014కు ముందు రెన్యూవల్ చేసుకున్నవారి వివరాలు ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో నమోదయ్యాయి. ఇదే ఇప్పుడు వారికి ఇబ్బందికరంగా మారింది. రెన్యువల్ సమయంలో తెలంగాణ అని ఆప్షన్ ఇచ్చుకున్నవారు ఏపీ నుంచి తెలంగాణకు మారడానికి 3 నెలల సమయం పడుతున్నదని ఆ నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నర్సింగ్ సర్టిఫికెట్‌ను రెన్యువల్ చేసుకునేందుకు ఎన్యూఐడీ కార్డు తప్పనిసరని నర్సింగ్ కౌన్సిల్లో నిబంధన పెట్టారని నర్సులు తెలిపారు. రెన్యువల్ ప్రక్రియకు 6 నెలల గ్రేస్ పిరియడ్ పెట్టారని, ఆ గడువు దాటితే రూ.5 వేలు, రెన్యువల్‌కు మరో రూ.2 వేలు జరిమానా విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెన్యువల్ కోసం ప్రతి రోజూ కోఠిలోని తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్‌కు 500 నుంచి 1000 మంది వస్తున్నారు. ఫోన్ ద్వారా ఈ ప్రక్రియ చేసుకోవచ్చని అధికారులు చెప్తున్నప్పటికీ రెన్యువల్ కావడం లేదని నర్సులు వాపోతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 81,173 మంది నర్సుల్లో ఇప్పటివరకు ఎన్యూఐడీ కోసం 51,285 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 27,467 మందికి ఎన్యూఐడీ జారీ అయినట్టు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అధికారిక వెబ్సైట్ స్పష్టం చేస్తున్నది. కాగా, ఇటీవల 2,300 నర్సింగ్ పోస్టులకు దాదాపు 40 వేల మంది పరీక్షలు రాశారు. వాటి ఫలితాలు గత వారమే విడుదల కావడంతో ప్రొవిజన్ లిస్టు కోసం అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. వీరంతా ప్రస్తుతం ఎన్యూఐడీ కార్డు కోసం దరఖాస్తు చేశారు. వారికి ఆ కార్డు రావడానికి 3 నెలల సమయం పడుతుందని కౌన్సిల్ అధికారులు చెప్తున్నారు.
దీంతో ఈ ప్రక్రియ ఆలస్యమైతే వారంతా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఆఫీసులో కేవలం రెండు కంప్యూటర్లతోనే రెన్యువల్ ప్రక్రియ చేస్తున్నారని, దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే నర్సులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదని నర్సులు వాపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు వైద్యశాఖ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపి రెన్యువల్ ప్రక్రియ వేగవంతమయ్యేలా వెంటనే చర్యలు తీసుకోవాలని నర్సింగ్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
నర్సుల రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ (ఎన్ఆర్టీఎస్)లో నమోదైనవారికి ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ వర్తిస్తుంది. నర్సులకు నేషనల్ యూనిక్ ఐడెంటిటీ నంబర్(ఎన్యూఐడీ)ని కేటాయిస్తారు. వారు తమ లైసెన్స్‌ను ప్రతి ఐదేండ్లకోసారి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో మొత్తం ఎంత మంది నర్సులు ఉన్నారనే గణాంకాలు కేంద్రం వద్ద ఉంటాయి. ఎన్ఆర్టీఎస్లో పేరును నమోదు చేసుకున్న నర్సులకు వారి ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఏకరూప పాస్‌బుక్‌లను జారీ చేస్తారు.