PG Courses | హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎమ్కాం కోర్సుకు డిమాండ్ పడిపోతున్నది. ఎమ్మెస్సీ గణితం చలామణిలో లేకుండా పోతున్నది. ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో సగం సీట్లు కూడా నిండటంలేదు. ఇది రాష్ట్రంలోని పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లోని పరిస్థితి. సంప్రదాయ పీజీ కోర్సుల్లో విద్యార్థులు చేరేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ఈ కోర్సుల్లో సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలోని 9 వర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో సీట్లను కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) ద్వారా భర్తీచేస్తున్నారు. ఈ ఏడాది మూడు రౌండ్లల్లో సీట్లను భర్తీచేశారు. అయినా పలు కోర్సుల్లో అడ్మిషన్లు లేక కోర్సులు వెలవెలబోతున్నాయి. ఈ ఏడాది సీపీగెట్ పరీక్షలకు 73,342 మంది దరఖాస్తు చేసుకుంటే 64,765 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 94శాతం క్వాలిఫై అయ్యారు. అయితే 47,222 సీట్లకు 24,606 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. వీరిలో కేవలం 16వేల మంది మాత్రమే ఇప్పటి వరకు రిపోర్టు చేశారు. నిరుడు కూడా 47,211 సీట్లకు కేవలం 20,519 సీట్లు(43.46శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంత మంది సీపీగెట్కు హాజరై, క్వాలిఫై అయినప్పుడు ఇంత పెద్ద మొత్తంలో సీట్లు ఎందుకు ఖాళీగా ఉంటున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఎంసీఏ, ఎంబీఏ, ప్రైవేట్ ఉద్యోగాల వైపు చూపు
మాస్టర్ ఆఫ్ కామర్స్ (ఎమ్కాం) ఒకప్పుడు అత్యంత డిమాండ్ గల కోర్సు. డిగ్రీలో ఇప్పటికీ బీకాం కోర్సే కింగ్. కానీ పీజీలో ఎమ్కాం కోర్సులో మాత్రం చేరేవారు కరువయ్యారు. ఎమ్కాం కోర్సులో 8,282 సీట్లుండగా కేవలం 2,420 (29.21 శాతం) సీట్లు మాత్రమే నిండాయి. ఎమ్మెస్సీ గణితంలో 4,244 సీట్లకు కేవలం 1,376 (32.44)శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. పీజీలో ఎవర్గ్రీన్ అయిన కింగ్ లాంటి కెమిస్ట్రీ కోర్సులో 4,195 సీట్లుంటే మూడు విడతల్లో 2,260 సీట్లు మాతమ్రే భర్తీ అయ్యాయి. డిగ్రీలో బీఎస్సీ చేసిన వారు ఎంసీఏ, ఇతర కోర్సులు, ప్రైవేట్ ఉద్యోగాల వైపు చూస్తున్నారు. బీకాం చదివినవారు ఎంబీఏ కోర్సుల వైపు మళ్లుతున్నారు. దీంతో ఏటా ఎమ్మెస్సీ, ఎమ్కాంకు డిమాండ్ తగ్గుతున్నది.