మేడ్చల్ రూరల్, మే 7: ఐఏఎస్ ఫౌండేషన్‌తో బీఏ/బీబీఏ మూడేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును మల్లారెడ్డి వర్సిటీలో ప్రవేశపెట్టడం గొప్ప ఆలోచన అని ఇంధనశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్‌శర్మ పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి వర్సిటీలో శనివారం నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. డిగ్రీలో ఉండగానే సివిల్ సర్వీస్‌లపై అవగాహన పెంచుకొంటే యూపీఎస్సీ ప్రవేశ పరీక్షలో విజయం సాధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఐఏఎస్ కాలేకపోయినా గ్రూప్-1, బ్యాంక్, కార్పొరేట్ సెక్టార్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. మల్లారెడ్డి వర్సిటీ, తక్షశిల ఐఏఎస్ అకాడమీ, ఐఏఎస్ టాపర్స్ అకాడమీ ఉమ్మడిగా ఈ కోర్సును నిర్వహిస్తున్నాయని, ఈ మేరకు ఒప్పందం చేసుకుంటున్నాయని వివరించారు. వర్సిటీ డైరెక్టర్ డాక్టర్ భద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, పారామెడికల్ సైన్సెస్‌తో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రారంభిస్తున్నామని, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సివిల్ సర్వీసెస్ ఔత్సాహికుల మార్గాన్ని సుసాధ్యం చేసేందుకు ఐఏఎస్ అకాడమీని ప్రారంభిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ వెంకటేశ్వర్రావు, తక్షశిల ఐఏఎస్ అకాడమీ ఎండీ దుర్గాప్రసాద్, వీసీ వీఎస్కే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.