Trans fat | ప్రాణాలు తీస్తున్న నూనెలు.. ట్రాన్స్ ఫ్యాట్‌తో దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న మరణాలు
రుచి కోసమో.. టైం పాస్కో కొంటున్న ప్యాకేజ్డ్ ఫుడ్స్, బయటి ఆహారపదార్థాలు మన కొంప ముంచుతున్నాయి. వాటిని తయారు చేసే సమయంలో కక్కుర్తిపడి సరైన వంట నూనెను వాడకపోవటం వల్ల కొంప కొల్లేరవుతున్నది.
- ట్రాన్స్ఫ్యాట్తో రోజురోజుకూ దేశంలో పెరుగుతున్న మరణాలు
- హృద్రోగ మరణాల్లో 4.6 శాతం
- ప్రాణాలు తీస్తున్న నూనెలు
- దేశంలో నిమిషానికి ఒక మరణం
- ప్రమాదకరంగా ప్యాకేజ్డ్ ఫుడ్స్
- కొంప ముంచుతున్న బయటి ఆహార పదార్థాలు, చిరుతిండ్లు
Trans fat | హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రుచి కోసమో.. టైం పాస్కో కొంటున్న ప్యాకేజ్డ్ ఫుడ్స్, బయటి ఆహారపదార్థాలు మన కొంప ముంచుతున్నాయి. వాటిని తయారు చేసే సమయంలో కక్కుర్తిపడి సరైన వంట నూనెను వాడకపోవటం వల్ల కొంప కొల్లేరవుతున్నది. ముఖ్యంగా ‘ట్రాన్స్ ఫ్యాట్’ ఏటా లక్షల మంది ప్రాణాలను తీస్తున్నది. ‘వనస్పతి’గా పిలిచే ఈ పారిశ్రామికంగా తయారు చేసే నూనె/కొవ్వు వల్ల మన దేశంలో నిమిషానికి ఒకరు మరణిస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్, ఇతర అధ్యయన సంస్థలే తేల్చిచెప్పాయి. కేంద్ర ప్రభుత్వం స్వయంగా లోక్‌సభలో ఈ నెల 11న ఈ వివరాలను వెల్లడించింది.
ఏమిటీ ట్రాన్స్ ఫ్యాట్
1 ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఒక అసంతృప్త కొవ్వు ఆమ్లం. ఇది రెండు రకాలుగా తయారవుతుంది. 1) సహజ 2) కృత్రిమ. మనం తినే మాంసాహారాల్లో, ఆవులు, బర్రెలు, గొర్రెల నుంచి సేకరించే పాలు, పాల ఉత్పత్తుల్లో ట్రాన్స్‌ఫ్యాట్ ఉంటుంది. అయితే ఇది సహజంగా తయారవడంతోపాటు, చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. కాబట్టి పెద్దగా ప్రమాదం ఉండదు.
2 పారిశ్రామికంగా ఎడిబుల్ ఆయిల్స్‌ను రసాయన ప్రక్రియ ద్వారా ట్రాన్స్ఫ్యాట్గా మార్చుతుంటారు. క్లుప్తంగా కృత్రిమ నూనె అని అంటాం. సాధారణ వాడుక భాషలో దీనిని వనస్పతి అని పిలుస్తుంటారు. దీనిని నూనెలా ద్రవ రూపంలో, ఘన రూపంలో తయారు చేస్తుంటారు.
ప్రభావం ఏమిటి?
ట్రాన్స్ఫ్యాట్లు మన శరీరంలోకి వెళ్లిన తర్వాత మన జీవక్రియ రేటుపై ప్రభావం చూపిస్తాయని అధ్యయనాలు చెప్తున్నాయి. దీంతో శరీరంలోని అవయవాల పనితీరు మందగిస్తుందని, క్రమంగా అవి విఫలం అవుతాయని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా నిర్వహించిన అధ్యయనాల్లో గుండె సమస్యలకు ట్రాన్స్‌ఫ్యాట్ కారణమని తేలింది. ట్రాన్స్ ఫ్యాట్ శరీరంలోకి వెళ్లిన తర్వాత ధమనుల గోడలపై పేరుకుపోయి మూసివేస్తున్నదని తేలింది.
- ట్రాన్స్‌ఫ్యాట్ వల్ల అనారోగ్య సమస్యతో మరణం సంభవించే ప్రమాదం 34 శాతం పెరుగుతుంది.
- గుండె సమస్యలు మొదలై మరణించే అవకాశం 28 శాతం పెరుగుతుంది.
ఎక్కడ, ఎందుకు వాడుతారు?
- ట్రాన్స్ఫ్యాట్ను ఎక్కువగా ప్యాకేజ్డ్ ఫుడ్స్, బిస్కెట్లు, కేకులు, రస్కులు వంటి ప్యాకేజ్డ్ బేకరీ ఆహారపదార్థాలు, ఫ్రై చేసిన ఆహార పదార్థాల తయారీకి వాడుతుంటారు.
- ట్రాన్స్‌ఫ్యాట్ చౌకగా తయారవుతుంది. కాబ్టటి నెయ్యి, వెన్న వంటి పాల ఉత్పత్తులకు బదులుగా వీటిని వాడుతుంటారు.
- సహజమైనవాటితో పోల్చితే ట్రా న్స్ ఫ్యాట్‌తో తయారు చేసిన ఆహా ర పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. రుచి కూడా మారదు.
- మనం ఇంట్లో అయినా, బయట హోటళ్లలో అయినా నూనెను ఒకటికంటే ఎక్కువసార్లు వేడి చేసినా ఈ ట్రాన్స్ ఫ్యాటీ ఆమ్లాలు తయారవుతాయని నిపుణులు చెప్తున్నారు.
నిమిషానికి ఒకరు మృతి
ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 5.40 లక్షల మరణాలు నమోదవుతున్నాయి. అంటే ప్రతి నిమిషానికి దాదాపు ఒకరు ఈ కృత్రిమ నూనెలకు బలవుతున్నారన్నమాట. మన దేశంలో వెలుగుచూస్తున్న గుండె సంబంధ మరణాల్లో 4.6 శాతం ఈ ట్రాన్స్‌ఫ్యాట్ వల్లే జరుగుతున్నాయని అధ్యయన నివేదికలు చెప్తున్నాయి.
ఏం చేయాలి?
ట్రాన్స్‌ఫ్యాట్ వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) తో కలిసి ‘ఈట్ రైట్ ఇండియా’ పేరుతో ఎలాంటి ఆహారం తీసుకోవాలో ప్రచారం చేస్తున్నది. ఇందులో భాగంగా కృత్రిమ నూనెలపై అవగాహన కల్పిస్తున్నది. ట్రాన్స్ఫ్యాట్కు దూరంగా ఉండేందుకు పలు సూచనలు చేసింది.
- ‘వనస్పతి’ని వంట కోసం వాడటం మానేయాలి.
- పూరి, పకోడి వంటి డీప్ ఫ్రై పదార్థాలు చేసే సమయంలో నూనెలను ఎక్కువ సేపు వేడి చేయొద్దు. ఆ నూనెలో ఆహార పదార్థాలను ఎక్కువ సేపు ఉంచకూడదు.
- ఒకసారి ఫ్రై చేయడానికి (గోలించడానికి) వాడిన నూనెలను తిరిగి మరోసారి ఫ్రై చేయడానికి చేయరాదు. అయితే ఆ నూనెలను కూరలు చేయడానికి
వాడుకోవచ్చు. - ఇంట్లో డీప్ ఫ్రై చేసే సమయంలో కడాయి వంటి చిన్న పాత్రలను వినియోగించాలి.
- బయటి నుంచి తెచ్చుకునే బిస్కట్లు, కేకులు, చిప్స్, చిరుతిండ్లు, ఇతర ఫ్రై చేసిన పదార్థాలను, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినడం తగ్గించాలి.
నూనెలు కొనేటప్పుడు జాగ్రత్త
- దుకాణానికి వెళ్లి నూనె కొనుగోలు చేసే సమయంలో దానిపై ఉండే ‘న్యూట్రిషన్ ఫ్యాక్ట్’ పట్టికను గమనించాలి. ఇందులో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ లేదా టీఎఫ్ఏ లేదా ట్రాన్స్ ఫ్యాట్ ఎంత శాతం ఉన్నదో చూడాలి. 0.2 గ్రాముల కన్నా ఎక్కువ ఉంటే దానిని వాడకపోవడం మంచింది.
- కొన్నిసార్లు ఉత్పత్తులపై టీఎఫ్ఏ అని నేరుగా రాయకుండా ‘షార్టెనింగ్’, ‘పార్షియల్లీ హైడ్రోజినేటెడ్ వెజిటేబుల్ ఆయిల్’ అని వాడుతుంటారు. ఇలాంటివి ప్రమాదకరమని ఎఫ్ఎస్ఎస్ఏఐ చెప్తున్నది.
బయటి ఆహారం.. సూచనలు
- బయటి నుంచి ఆహార పదార్థాలు తెప్పించుకునే సమయంలో వాడుతున్న నూనెల గురించి అడగాలి.
- వనస్పతితో చేసిన ఆహార పదార్థాలను తినడం మానేయాలి.
- ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసా, ఆలూచాట్ వంటి వాణిజ్యపరంగా తయారు చేసే ఉత్పత్తులను తినడం తగ్గించాలి.
- కుకీస్, చిప్స్, కేక్స్ వంటి బేక్డ్ ఫుడ్‌ను తగ్గించాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Keerthy Suresh | చీరకట్టులో కీర్తి సురేష్ అందాల విందు.. చూపులతోనే కుర్రాళ్లకు చెక్!
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
IND vs NZ | ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌కు 87 పరుగుల భారీ ఓటమి
Woman body in Pune flat | కుమార్తె లండన్‌లో చదువుతున్నదని భావించిన తల్లిదండ్రులు.. పూణే ఫ్లాట్‌లో ఆమె మృతదేహం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

