జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం (సరస్వతి) బరాజ్‌ను సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) డైరెక్టర్ల బృందం గురువారం సాయంత్రం పరిశీలించింది. సోషల్ మీడియాలో అన్నారం బరాజ్‌పై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సీడబ్ల్యూసీ, రాష్ట్ర బృందం అన్నారం బరాజ్ గేట్లను పరిశీలించింది. వాటికి ఎలాంటి సమస్యా లేదని పేర్కొంది. 28, 38వ గేట్ల సమీపంలో చిన్న చిన్న సీపేజ్‌లు ఏర్పడినట్టు గుర్తించిన అధికారులు.. వాటితో పెద్ద ప్రమాదం లేదని తేల్చారు.
బుధవారం చిన్న చిన్న సీపేజ్‌లు ఏర్పడగానే ఇరిగేషన్ అధికారుల బృందం స్టోన్, మెటల్, ఇసుకతో ట్రీట్మెంట్ చేసింది. అధికారులు తీసుకున్న నిర్ణయాలను సీడబ్ల్యూసీ బృందం ప్రశంసించినట్టు అన్నారం బరాజ్ ఈఈ యాదగిరి తెలిపారు. సీపేజ్ల ద్వారా స్వల్పంగా నీరు తప్పితే ఇసుక బయటకు వెళ్లదు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు.
కాంక్రీట్ డ్యాంలలో సైతం సీపేజ్‌లు ఏర్పడతాయని, ఇవి సాధారణమేనని సీడబ్ల్యూసీ బృందం పేర్కొన్నట్టు తెలిసింది. కాకపోతే అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అనంతరం రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో సీడబ్ల్యూసీ బృందం సమావేశమై అసరమైన సలహాలు, సూచనలు చేసింది. కార్యక్రమంలో సీడబ్ల్య్లూసీ డైరెక్టర్లు ఆర్ తంగమణి, రమేశ్‌కుమార్, దేవేందర్‌రావు, ఇరిగేషన్ ఈఎన్సీ ఓఅండ్ఎం నాగేంద్రరావు, కాళేశ్వరం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.