హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు అధిక ఉత్పాదకత, లాభసాటిగా ఉండేందుకు సింగిల్ పిక్ కాటన్ ప్రమోషన్‌పై, ప్రతిపాదిత కార్యాచరణ ప్రణాళికపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం బీఆర్కే భవన్లో సంబంధిత అధికారులతో చర్చించారు. ఉత్పాదకతను పెంపొందించడంతో పాటు రాష్ట్రంలోని రైతులకు అధిక ఆదాయం లభించేలా సింగిల్ పిక్ పత్తిని ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. సింగిల్ పిక్ పత్తి 40 శాతం అధిక దిగుబడిని అందిస్తుందని సీఎస్ తెలిపారు. పలు దేశాలు కూడా ఈ రకమైన పత్తి పంటను వేస్తున్నారని వివరించారు.
ఈ పత్తి సాగుకు సరిపడా విత్తనం అందుబాటులో ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో సింగిల్‌పిక్ పత్తి సాగు చేయించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. గతంలో విత్తన కంపెనీల ద్వారా ట్రయల్స్ నిర్వహించిన ప్రాంతాల్లో పత్తి ఏరియా విస్తరణను చేపట్టాలని సూచించారు. ఈ సింగిల్ పిక్ పత్తి వేయడంపై రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాలు, మండలాలు, గ్రామాలలో రైతులను చైతన్య పర్చాలన్నారు.
హెచ్‌డిపిఎస్ (హై-డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టం) టెక్నాలజీని ప్రోత్సహించేందుకు విత్తన కంపెనీల సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ విస్తరణ అధికారుల సమావేశం నిర్వహించి, ఈ సింగల్ పిక్ పత్తిని సాగు చేసే రైతుల వివరాలను నమోదు చేయించాలని ఆదేశించారు. దీనికై రైతు ప్రొఫైల్, వర్షపాతం వివరాలు, పంటల క్యాలెండర్ తదితర వివరాలతో కూడిన యాప్‌ను రూపొందించాలని సూచించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి ఎం రఘునందన్ రావు, పీజేటీఎస్ఏయూ వీసీ ప్రవీణ్‌రావు, అగ్రికల్చర్ స్పెషల్ కమిషనర్ హనుమాన్ కె జెండగే, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామ్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.