CS Review | ప్రస్తుత ఏప్రిల్, మే మాసాల్లో ఎండల నేపథ్యంలో వడదెబ్బ, డీ హైడ్రేషన్ బారినపడకుండా ప్రజలను చైతన్యవంతులను చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా, ఎండల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందుజాగ్రత్త చర్యలు, పాఠశాలల్లో మౌలిక వసతులు, ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రెండు మాసాల్లో రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణా ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో 45 డిగ్రీలకు ఉష్టోగ్రతలు చేరుకుని తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపారు. ఈ సందర్భంగా వేసవిలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్తలపై ప్రజలను పెద్దఎత్తున అవగాహన కల్పించాలన్నారు.
ఇప్పటికే అన్ని జిల్లాలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్, ఇతర మందులను పెద్ద మొత్తంలో పంపిణీ చేశామన్నారు. వాటన్నింటినీ సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో అందుబాటులో ఉంచినట్లు శాంతి కుమారి తెలిపారు. ఓఆర్ఎస్ పాకెట్లను కూడా ప్రతీ ఆశ కార్యకర్తల వద్ద అందుబాటులో ఉన్నాయని.. ఉపాధిహామీ పనుల కేంద్రాల వద్ద కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పిల్లలు, వృద్ధులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏ ఒక్కరూ ఎండదెబ్బ బారిన పడకుండా ముందు జాగ్రత చర్యలను చేపట్టాలని ఆదేశించారు.
మంచినీటి సరఫరా పర్యవేక్షణకు స్పెషల్ అధికారులు రాష్ట్రంలో మంచినీటి సరఫరాను మరింత సమర్థవంతంగా చేసేందుకు ప్రతీ మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్టు సీఎస్ పేర్కొన్నారు. ప్రతీ రోజు మంచినీటి సరఫరాను పర్యవేక్షించడానికి ప్రతీ మండలానికి జిల్లా స్థాయి అధికారిని, ప్రతీవార్డు, గ్రామానికి మండల స్థాయి అధికారిని నియమిస్తున్నట్టు చెప్పారు. స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం జిల్లాలో మంచినీటి సరఫరాను పర్యవేక్షిస్తారని అన్నారు.
ఏ గ్రామంలోనైనా మంచినీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడితే, ఆయా గ్రామాల్లోని వ్యవసాయ బావుల నుంచి అద్దె ప్రాతిపదికపై నీటిని సరఫరా చేయాలని సూచించారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని అందించాలన్నారు. ఇప్పటికే, అన్ని గ్రామాలు, వార్డులలోని బోరుబావుల మరమ్మతులు, ఫ్లషింగ్ లను పూర్తి చేయడంతోపాటు పైప్ లైన్ల లీకేజీలను అరికట్టినట్లు తెలిపారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి పాలేరు జలాశయానికి తాగునీటి అవసరాలకు నేడు ఉదయం కృష్ణా జలాలను విడుదల చేయడం జరిగిందన్నారు. పాలేరు ప్రాజెక్టుకు చేరుకునేలా నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు తగు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు.
రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలుకు 7149 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, మరో నాలుగైదు రోజుల్లో ఈ కేంద్రాలన్నీ ప్రారంభమవుతాయని తెలిపారు. ఇప్పటికే ప్రారంభమైన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. గ్రామాల్లో ప్రైవేటు కాంటాలను తెరిచి ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు కొనుగోళ్లు చేసే వారిని గుర్తించి తగు చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో మనవూరు -మనబడి కార్యక్రమం కింద అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పనులన్నింటినీ సంబంధిత ఏజెన్సీల ద్వారా వెంటనే ప్రారంభించి, వాటి పురోగతిని పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు.