హైదరాబాద్, జూలై14 (నమస్తే తెలంగాణ): నదీ జలాలకు సంబంధించిన అంశాలపై తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ముఖ్యమంత్రులతో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ 16వ తేదీన ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆ మీటింగ్ ఎజెండాలో పొందుపరచాల్సిన అంశాలపై ఇరిగేషన్ శాఖ ఇంటర్‌స్టేట్ విభాగం అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం సచివాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఇంటర్‌స్టేట్ సీఈ విజయ్‌కుమార్, గోదావరి డీడీ సుబ్రహ్మణ్యప్రసాద్ తదితర అధికారులతో చర్చించారు. తెలంగాణ ప్రాజెక్టులు, నెలకొన్న సమస్యలపై సమాలోచనలు చేశారు. ఇదిలా ఉండగా ఎర్రమంజిల్‌లోని జలసౌధలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.