నదులకు కొదువలేదిక్కడ.. కష్టించే జీవుల కరువులేదిక్కడ. మట్టిని బంగారం చేసే కర్షకుడున్నాడిక్కడ.. గనుల్లో నల్ల బంగారం తీసే పనిమంతులున్నారిక్కడ. పరాయి పాలనలో వెక్కిరింపులు చూసిన ఈ వనరులు నేడు వెలుగులు విరజిమ్ముతున్నాయి. సంపద రాశులై దేశాన్ని సుసంపన్నం చేస్తున్నాయి.. నా తెలంగాణ కోటి రతనాల వీణ..
హైదరాబాద్, సెప్టెంబర్17 (నమస్తే తెలంగాణ): ఆరు దశాబ్దాల పోరాటం తర్వాత ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం, ఆరేండ్లలోనే అభివృద్ధిలో, సంపద సృష్టిలో దేశానికి దిక్సూచిగా మారింది. అన్ని రంగాల్లో దూసుకుపోతూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచింది. భౌగోళికంగా 11వ స్థానంలో, జనాభా పరంగా 12వ స్థానంలో ఉన్నా.. ఆర్థిక వృద్ధిలో ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది. సొంత రాబడుల్లో దేశంలో మొదటి స్థానంలో నిలిచి ఇతర రాష్ర్టాలకు అందనంత ఎత్తుకు చేరుకొన్నది. వ్యవసాయం, విద్యుత్తు, పరిశ్రమలు, ఐటీ.. ఇలా అన్ని రంగాల్లోనూ తెలంగాణ రెట్టింపు వృద్ధిని సాధించింది. దేశ జీడీపీకి అత్యధిక వాటా అందిస్తున్న 4వ రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించింది. పన్ను రాబడులు, జీఎస్డీపీ, తలసరి ఆదాయం, ప్రాథమిక, ద్వితీయ, సేవా రంగాల్లో వృద్ధి.. ఇలా అన్ని అంశాల్లో చెరగని ముద్ర వేసింది. అందుకే తెలంగాణను దేశం మెచ్చుకొన్నది. ప్రముఖ ఆర్థిక సంస్థలు, ఆర్థికరంగ నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులు శభాష్ తెలంగాణ అని కీర్తిస్తున్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపును కొనియాడుతున్నారు. వివిధ సందర్భాల్లో తెలంగాణ అభివృద్ధిపై వచ్చిన ప్రశంసల జల్లులు..
వయసు చిన్నదైనా వృద్ధి ఘనం
తెలంగాణ రాష్ట్రం వయసులో చిన్నదే అయినా.. అభివృద్ధిలో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఏటా 9 శాతానికిపైగా వృద్ధి సాధిస్తున్నది. నూతన పాలసీలు, పరిశ్రమలతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది.
-నీతి అయోగ్ చైర్మన్ రాజీవ్‌కుమార్
(సెప్టెంబర్ 12, 2021)
దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి
దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉన్న మొదటి ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉన్నది. అన్నిరంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్నది. దేశాన్ని సాదుతున్న కొద్ది రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి.
-ఆర్బీఐ హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ది ఇండియన్ ఎకానమీ 2020 21
(సెప్టెంబర్ 15, 2021)
దేశానికి తెలంగాణ మార్గదర్శి
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఏడేండ్లలోనే తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ దేశానికే మార్గదర్శిగా ఎదిగింది. టీఎస్ ఐపాస్, టీ-హబ్ లాంటి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నది. వివిధ రంగాల్లో వినూత్న విధానాలను అవలంబిస్తూ దేశంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించింది. -తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య మండళ్ల సమాఖ్య (జూన్ 1, 2021)
మెరుగైన ఆర్థిక వ్యవస్థ
ఆర్థిక సంస్కరణల అమలులో తెలంగాణ ఉత్తమ ఫలితాలను సాధించింది. మున్సిపల్ సంస్కరణలు సమర్థవంతంగా అమలు చేసిన మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. బహిరంగ మార్కెట్ నుంచి మరో రూ.2,508 కోట్ల రుణం పొందడానికి అర్హత సాధించింది. –కేంద్ర ఆర్థిక శాఖ (జనవరి 7, 2021)
వ్యాపార సంస్కరణల్లో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉన్నది. అభివృద్ధిలో శరవేగంగా ముందుకెళ్తున్నది.
-బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్
-2019 ర్యాంకింగ్స్
వృద్ధిలో జోరు
తెలంగాణ కొత్త రాష్ట్రమే అయినా 20 శాతం వార్షిక వృద్ధి లక్ష్యంతో ప్రణాళికలు అమలుచేసి, సగటున 14-15 శాతం వృద్ధి సాధించడం గొప్ప విషయం.
-నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ, న్యూఢిల్లీ-2019 నివేదిక
ప్రగతిలో తెలంగాణ భేష్
రాష్ట్రం ఆవిర్భవించిన రెండేండ్లలోనే తెలంగాణలో గుణాత్మక మార్పు కనిపిస్తున్నది. అన్ని రాష్ట్రాల కంటే ముందున్నది. నిఘా వర్గాల సమాచారం, గవర్నర్లు ఇచ్చే నివేదికలు, వ్యక్తిగతంగా వారితో ఫోన్లో మాట్లాడినప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ ప్రగతిలో గుణాత్మకమైన మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది.
-మంత్రివర్గ సహచరులతో ప్రధాని మోదీ
(మే 19, 2016)
దూసుకుపోతున్న తెలంగాణ
దేశంలోనే అతి పిన్న రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ఇకపై కూడా తెలంగాణలో అభివృద్ధి ఇలాగే కొనసాగాలి. ప్రజల కనీస అవసరాలు తీర్చే పనులకు తెలంగాణ ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తున్నది.
-మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
(ఏప్రిల్ 6, 2018)
ఆదర్శ రాష్ట్రం తెలంగాణ
ఆదర్శవంతమైన కార్యక్రమాలతో తెలంగాణ వృద్ధిలో దూసుకుపోతున్నది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు, పథకాలు రూపొందించి విజయవంతంగా అమలుచేస్తున్నది.
-పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (సెప్టెంబర్ 8, 2021)