హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): దేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు రాజ్యాంగమే ప్రధాన అడ్డంకి అని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నదని కేరళ సీపీఐ రాజ్యసభ సభ్యుడు పీ సంతోష్‌కుమార్ దుయ్యబట్టారు. అందుకే 2024 పార్లమెంటు ఎన్నికలయ్యాక నూతన రాజ్యాంగ రూపకల్పనకు కొత్త రాజ్యాంగసభను ఏర్పాటు చేసేందుకు కుట్ర పన్నుతున్నదని హెచ్చరించారు. కమ్యూనిస్టు ఉద్యమ దిగ్గజం, భారత కమ్యూనిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు 108వ జయంతి వేడుకలను హైదరాబాద్ కొండాపూర్ సీఆర్ ఫౌండేషన్ ప్రాంగణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చండ్ర రాజేశ్వరరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం నీలం రాజశేఖర్ రిసెర్చ్ సెంటర్ ఇంద్రజిత్ హాల్లో ఏర్పాటు చేసిన ‘రాజ్యాంగానికి ప్రమాదం – ఎవరి నుంచి?’ అనే అంశంపై సంతోష్‌కుమార్ మాట్లాడారు. మోదీ హయాంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రాధాన్యం కోల్పోయిందని అన్నారు. స్వాతంత్య్రోద్యమంలో ఎలాంటి పాత్ర లేని ఆర్ఎస్ఎస్ కొందరిని హీరోలుగా చిత్రీకరిస్తున్నదని పేర్కొన్నారు. గాంధీని చులకన చేస్తూ, ఆయనను చంపిన గాడ్సేకు మందిరాలు కడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, ఈడీ వంటి నిష్పాక్షిక సంస్థలు సైతం దురదృష్టవశాత్తు కేంద్రం నియంత్రణలోకి వచ్చాయని అన్నారు. ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు సురవరం సుధాకర్, అధ్యక్షుడు డాక్టర్ కే నారాయణ, ప్రధాన కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.