మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 05, 2020 , 17:04:38

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌

హైదరాబాద్‌ : మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డిని అరెస్టు అయ్యారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రేవంత్‌ను నార్సింగ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా రెండు రోజుల క్రితం మియాఖాన్ గూడ వద్ద డ్రోన్ కెమెరాలు ఉపయోగించినందుకు ఎంపీ రేవంత్‌రెడ్డిపై రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. 

ఎయిర్‌ క్రాఫ్ట్‌ నిబంధనలను ఉల్లంఘించి జిల్లాలోని మియాఖాన్‌గూడ వద్ద డ్రోన్‌ కెమెరాలను వియోగించిన కేసులో రేవంత్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో పోలీసులు బుధవారం ఐదుగురిని అరెస్టుచేయగా, విచారణ అనంతరం నిందితులుగా తేలితే రేవంత్‌రెడ్డి, అతని సోదరుడితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేస్తామని పోలీసులు పేర్కొన్న విషయం విదితమే. 

కేసు వివరాలిలా ఉన్నాయి.. మార్చి 1న ఎంపీ రేవంత్‌రెడ్డి సోదరుడైన అనుముల కృష్ణారెడ్డి (45) సూచనమేరకు ఉప్పర్‌పల్లికి చెందిన అన్నదమ్ములు విజయ్‌పాల్‌రెడ్డి, ప్రవీణ్‌పాల్‌రెడ్డి, వీరి స్నేహితుడైన విజయ్‌సింహారెడ్డి కారులో జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ ఆఫీస్‌కు వచ్చారు. అక్కడినుంచి డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరణ కోసం ప్రవీణ్‌పాల్‌రెడ్డి, విజయ్‌సింహారెడ్డి కోకాపేటకు వెళ్లి జైపాల్‌రెడ్డి అనే వ్యక్తిని కలిశారు. జైపాల్‌రెడ్డి స్థానిక యువకుడైన ఓం ప్రకాశ్‌రెడ్డిని వీరికి పరిచయం చేసి చిత్రీకరణకు సహకరిస్తారని చెప్పారు. 

వీరంతా డ్రోన్‌ కెమెరాతో అక్కడి క్రికెట్‌ గ్రౌండ్‌వద్ద ఉన్న ఎత్తు ప్రదేశానికి వెళ్లారు. రహస్యంగా వారు అనుకున్న ప్రాంతంతోపాటు పరిసరాలను చిత్రీకరించి వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించారు. వివరాలను కృష్ణారెడ్డికి వాట్సప్‌ ద్వారా పంపించారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డి కార్యాలయానికి చేరుకొని పూర్తి సమాచారాన్ని కృష్ణారెడ్డికి అందజేశారు. 

ఈ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో దర్యాప్తుచేసిన నార్సింగి పోలీసులు.. బుధవారం ప్రవీణ్‌పాల్‌రెడ్డి, విజయ్‌సింహారెడ్డి, జైపాల్‌రెడ్డి, రాజేశ్‌ (డ్రోన్‌ ఆపరేటర్‌), శివ, ఓం ప్రకాశ్‌రెడ్డిను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. వీరందరీపై 224/2020లో సెక్షన్‌ 184,187 ఐపీసీ, 11ఏ రెడ్‌ విత్‌ 5ఏ ఎయిర్‌ క్రాఫ్ట్‌ కింద అభియోగాలు మోపారు. సైబరాబాద్‌ పరిధిలో డ్రోన్‌ కెమెరా ఉపయోగించడంపై ఇప్పటికే నిషేధం ఉన్నది.


logo
>>>>>>