హైదరాబాద్, జూలై 3(నమస్తే తెలంగాణ): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం ముగిశాయి. రెండోరోజు సమావేశాలు ప్రారంభమైన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నదని, ఆర్టికల్ 370 రద్దు, సర్జికల్ స్ట్రైక్స్ వంటివాటిని సైతం వ్యతిరేకిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అవకాశవాద, అవినీతి రాజకీయాలకు కాంగ్రెస్ కేరాఫ్‌గా మారిందన్నారు. విభజన ఏజెంట్లకు సహకరిస్తుందని, జమ్ము కశ్మీర్‌ను అంతర్జాతీయ సమస్యగా మార్చే ప్రయత్నం చేస్తున్నదని పేర్కొన్నారు. తీర్మానం వివరాలను అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. గుజరాత్ హింసాకాండ, ఇతర కేసుల్లో ప్రధాని మోదీపై వచ్చిన ఆరోపణలను సుప్రీంకోర్టు కొట్టివేయడం పట్ల సభ్యులు హర్షం వ్యక్తంచేశారన్నారు. ఎనిమిదేండ్ల ఎన్డీయే పాలనలో సాధించిన విజయాలను చర్చించినట్టు తెలిపారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలపైనా సమావేశాల్లో చర్చించినట్టు పేర్కొన్నారు. ‘పనితీరు చూపించండి.. పాలించండి’ అనే నినాదంతో ముందకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. సమావేశాల్లో భాగంగా తెలంగాణపైనా రాజకీయ తీర్మానం చేశారు.
ఈ వివరాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను, ప్రధాని మోదీ ప్రసంగం ముఖ్యాంశాలను వివరించారు. సమావేశాల భోజన విరామంలో సభ్యులకు వడ్డించే పదార్థాలను ప్రధాని మోదీ స్వయంగా వెళ్లి చూశారు. ఈ సమావేశాలకు సుమారు 1500 మంది ప్రతినిధులు హాజరైనట్టు సమాచారం. సమావేశాల అనంతరం ప్రధాని మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్‌షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ‘విజయ సంకల్ప సభ’లో పాల్గొన్నారు.