హైదరాబాద్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ): అసైన్డ్ భూములపై త్వరలోనే సమగ్ర విధాన నిర్ణయం తీసుకోనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 85 వేల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని, వాటి విషయంలో సమగ్ర విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని కోణాల్లో ప్రభుత్వం చర్చిస్తున్నదని వెల్లడించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని, ఎవరికీ అనుకూలంగా లేదా వ్యతిరేకంగా వ్యవహరించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు.
నిబంధనల ప్రకారమే ప్రతి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా ఒక సెంటు భూమి కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదని చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు ధరణి పోర్టల్‌లో ఉన్న జాబితానే కోర్టుకు సమర్పించామని, వివాదాలు లేని ప్రైవేట్ ఆస్తులు లేదా ప్లాట్లను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని పేరొన్నారు. ధరణి నుంచి భూభారతి వరకు జరిగిన ప్రతి భూ లావాదేవీని ఫాస్ట్‌ట్రాక్ విధానంలో విచారిస్తున్నామని, అక్రమాలకు పాల్పడిన వారెవరైనా చట్టం ముందు నిలబెట్టడం ఖాయమని హెచ్చరించారు. భూముల మారెట్ విలువల సవరణ తర్వాత ప్రభుత్వం అంచనా వేసిన దాని కంటే 10 నుంచి 20% వరకు అధిక ఆదాయం వచ్చిందని తెలిపారు.