CM KCR | నిజామాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రైతుల భూములు సేఫ్‌గా ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మీ భూములను కాపాడుకునేందుకు మీ బొటనవేలికే ప్రభుత్వం అధికారం ఇచ్చింది. మరి ఈ అధికారాన్ని మీరు కాపాడుకుంటారా..? కాంగ్రెస్‌కు అప్పజెప్పి పొడగొట్టుకుంటారా..? అని కేసీఆర్ ప్రశ్నించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ధరణి పోర్టల్ వల్ల రైతుల భూములు సేఫ్‌గా ఉన్నాయి. మీ భూములను కాపాడుకునేందుకు మీ బొటనవేలికి అధికారం ఇచ్చింది ప్రభుత్వం. మీ భూమి హక్కు మార్చే అధికారం ముఖ్యమంత్రికి కూడా లేదు. ఈ అధికారం ప్రభుత్వం మీకు ఇచ్చింది. ఈ అధికారాన్ని మీరు కాపాడుకుంటారా..? కాంగ్రెస్‌కు అప్పజెప్పి పొడగొట్టుకుంటారా..? మీరు నిర్ణయం చేయాలి. రైతుబంధు డబ్బులు ఎలా వస్తున్నాయి.. మేం హైదరాబాద్‌లో విడుదల చేస్తే సెల్ఫోన్లు టింగ్ టింగ్‌మని మోగుతున్నాయి. బ్యాంక్‌కు వెళ్లి చూస్తే డబ్బులు మీ ఖాతాలో ఉంటున్నాయి. ఆ డబ్బులతో ఎరువులు, విత్తనాలు కొంటున్నారు. మరి ఇవాళ ధరణి ఎత్తేస్తే రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి. ఇవన్నీ పోతే వైకుంఠం ఆటలో పెద్ద పాము మింగినట్టు అవుతది అని కేసీఆర్ అన్నారు.
కాంగ్రెస్ రాజ్యం వస్తే మళ్లీ పైరవీకారులు, దళారులు వస్తరు. ఇప్పుడు ఎవరికి లంచం ఇవ్వకుండానే మీ ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చుడంటే మళ్లా భూ కబ్జాలు, పైరవీకారులు, పాత రిజిస్ట్రేషన్ పద్ధతి, పడిగాపులు పడి ఉండాలి, పట్టా కోసం ఏడాది తిరగాలి, దానికి ముట్టజెప్పేది ముట్టజెప్పాలి. ఇవన్నీ చూశాం. భూమి అమ్మితే, కొంటే ఆర్డీవో ఆఫీసుకు పోవాలి.. ఇచ్చేటోనికి ఇవ్వాలి. ఇవాళ ఆ బాధ లేదు.. ఇవాళ నిమిషాల్లో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. భాజప్త వెబ్సైట్లో వచ్చేస్తుంది. దాన్ని ఎవరూ కూడా కదిరలించలేరు. ఇలాంటి ధరణిని తీసేస్తరట. ఇంత క్లీన్‌గా ఉన్న వ్యవహారం మళ్లీ మురికి కుంటగా కావాల్నా..? ఇది పెద్ద ప్రమాదం. కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవన్నీ ఎత్తేస్తామని వాళ్లు కుల్లా చెప్తున్నారు.. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలు. కాబట్టి చర్చ పెట్టి ఏ పార్టీకి అధికారం ఇస్తే బాగుంటదని ఆలోచించాలి అని కేసీఆర్ సూచించారు.
మనం కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్నాం. కేసీఆర్ కంటే ఎత్తు, దొడ్డుగా ఉన్నోళ్లు సీఎంలు అయ్యారు. కానీ మంచినీళ్ల గురించి ఆలోచించలేదు.. తీసుకురాలేదు. ఎన్ని బాధలు పడ్డాం మంచినీళ్లకు. ఇప్పుడు ఆ బాధ లేదు. ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తున్నాం. ఈ మాత్రం పని వారు ఎందుకు చేయలేదు. కేసీఆర్ కిట్ గురించి ఎవరూ ఆలోచించలేదు. గర్భిణులను అమ్మ ఒడి వాహనం ద్వారా ఆస్పత్రికి తీసుకెళ్లి, కాన్పు అయ్యాక మళ్లా ఇంటి దగ్గర వదిలిపెడుతున్నాం. హాస్పిటల్‌కు డబ్బులు కట్టేది పోయి ఉల్టా గవర్నమెంట్ పైసలు ఇస్తుంది. దీంతో పేదలకు బాధ తప్పింది. కంటి వెలుగు ప్రోగ్రాం ద్వారా 3 కోట్ల మందికి పరీక్షలు చేసి 80 లక్షల మందికి కండ్లద్దాలు ఇచ్చాం. ఇవన్నీ మానవీయ కోణంలో చూశాం. సంపద పెరిగిన కొద్ది పంచుకుంటూ పోతున్నాం. ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలని చెప్పి ఇన్ని కార్యక్రమాలతో ప్రజల ముందుకు వస్తున్నాం. దయచేసి ఇవన్నీ ఉండాల్నా.. పదేండ్లు పడ్డ శ్రమ వృథా కావాల్నా.. అద్భుతంగా అభివృద్ధి చెందిన ఈ రాష్ట్రంలో మళ్లీ పాత కథనే రావాల్నా..? ఇవన్నీ ఆలోచించాలి అని కేసీఆర్ సూచించారు.