CM KCR | పేదల సంక్షేమమే నా మాడల్.. తెలంగాణలో మూడోసారీ అధికారం మాదే: సీఎం కేసీఆర్
దేశంలోని పేదలకు సంక్షేమ ఫలాలు అందాలి.. వ్యవసాయం, పారిశ్రామికం అభివృద్ధి చెందాలి.. భారత్‌ను ప్రపంచ ఆహార మార్కెట్‌గా మార్చాలి.. ఇదే తన డెవలప్మెంట్ మాడల్ అంటున్నారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయమని, మూడోసారి కచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
- 95 నుంచి 100 స్థానాల్లో కచ్చితంగా గెలుస్తాం
- పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సుభిక్షం
- కాళేశ్వరంపై కాంగ్రెస్ ఆరోపణలు వెర్రితనమే
- ఇండియా కూటమి ఎప్పుడో విచ్ఛిన్నమైంది
- ప్రచార సభల్లో ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్ధాలే
- రెండు చోట్ల పోటీపై ఫలితాల తర్వాత వివరిస్తా
- రైతు పథకాలు తెచ్చేందుకు మేధోచర్చలు జరిపా
- మూడో టర్మ్‌లో విద్య, వైద్యంపై మరింత ఫోకస్
- 2024లో కేంద్రంలో వచ్చేది కిసాన్ సర్కారే
- ‘ఇండియా టుడే’ ఇంటర్వ్యూలో సీఎం కేసీఆర్
CM KCR | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): దేశంలోని పేదలకు సంక్షేమ ఫలాలు అందాలి.. వ్యవసాయం, పారిశ్రామికం అభివృద్ధి చెందాలి.. భారత్‌ను ప్రపంచ ఆహార మార్కెట్‌గా మార్చాలి.. ఇదే తన డెవలప్మెంట్ మాడల్ అంటున్నారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయమని, మూడోసారి కచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రముఖ ఆంగ్ల వారపత్రిక ‘ఇండియా టుడే’కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ ఉద్యమ నేపథ్యం, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, తెలంగాణ రికార్డులను సీఎం కేసీఆర్ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా వివరించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను, ఇండియా కూటమిలో లుకలుకలను ఎండగట్టారు. దాదాపు 100 నిమిషాలపాటు జరిగిన ఇంటర్వ్యూ పూర్తిపాఠం ఇది.
తెలంగాణలో మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. హ్యాట్రిక్ విజయంపై మీరు ధీమాగా ఉన్నారా?
అవును. 2018లో సాధించిన 88 సీట్ల కంటే ఈసారి ఎక్కువ సీట్లను గెలుచుకుంటాం. మూడోసారి విజయం మాదే. ఈసారి 95 నుంచి 100 స్థానాల్లో కచ్చితంగా విజయం సాధిస్తాం.
దేన్ని ఆధారంగా చేసుకొని ఇంత ధీమాగా చెప్తున్నారు?
ఏదైనా రాష్ట్రం అభివృద్ధి సాధించిందో లేదో తెలుసుకోవాలంటే ముందుగా తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకొంటారు. ప్రస్తుతం తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3.12 లక్షలు. గోవా వంటి చిన్న రాష్ర్టాలను మినహాయిస్తే, తలసరిలో దేశంలోనే నం.1 తెలంగాణే. 2014లో రూ.లక్ష తలసరితో తెలంగాణ దేశంలో 18వ స్థానంలో ఉండేది. ఇప్పుడు రాష్ట్ర తలసరి 3 రెట్లు పెరిగింది.
మిగతా అభివృద్ధి అంశాల గురించి చెప్పండి
2014లో రాష్ట్రంలో తలసరి విద్యుత్తు వినియోగం 1,100 యూనిట్లుగా ఉండేది. ఇప్పుడు అది 2,200 యూనిట్లకు చేరింది. అంటే రెట్టింపైంది. విద్యుత్తు వినియోగమంటేనే పురోగతి. ఇక, రాష్ట్రం ఏర్పడినప్పుడు నిరుద్యోగ రేటు 14-15 శాతం కంటే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు 5 శాతానికంటే దిగువకు వచ్చింది. ఇవన్నీ కేంద్రప్రభుత్వం చెప్తున్న గణాంకాలే. కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు వలసలు పెద్ద సమస్య. ఇప్పుడు ఆ పరిస్థితిలేదని నేను గర్వంగా చెప్తున్నా. డజనుకు పైగా రాష్ర్టాల నుంచి వలస వచ్చిన కూలీలు తెలంగాణలో 25 లక్షల మందికిపైగా ఉన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జీఎస్డీపీ 3 రెట్లు పెరిగింది.
ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్టు ఒపీనియన్ పోల్స్ చెప్తున్నాయి కదా!
అధికారపార్టీకి అనుకూలతలు ఉండటంతోనే జ్యోతిబసు, నవీన్ పట్నాయక్ అనేక పర్యాయాలు గెలిచి, రాష్ర్టాలను పాలించారు. మా ప్రభుత్వానికి కూడా సానుకూల పవనాలే ఉన్నాయి.
సానుకూల పవనాలు ఉంటే మీరు రెండు స్థానాల నుంచి ఎందుకు పోటీచేస్తున్నారు? గెలుపుపై మీరు ఆందోళనగా ఉన్నారా?
కేసీఆర్ ఎప్పుడూ, ఏ విషయంలోనూ ఆందోళన చెందడు. రెండు చోట్ల పోటీ వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చాక చెప్తాను.
మీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని, వారిపై ప్రజావ్యతిరేకత ఉన్నట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ఏం చెప్తారు?
మా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఒక్క అవినీతి కేసు కూడా లేదు. అందుకనే ఒక్క మంత్రిని కూడా తొలగించలేదు. ఒక వేళ తెలంగాణలో అవినీతి రాజ్యమేలితే, దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు పెడ్తామంటూ కంపెనీలు ఎందుకు వస్తాయి?
సిట్టింగ్ ఎమ్మెల్యేలకే చాలావరకూ టికెట్లు మళ్లీ ఎందుకు ఇచ్చారు?
ఎందుకంటే, తెలంగాణ ఉద్యమంలో చాలామంది కీలకపాత్ర పోషించారు. వారి అంకితభావం ఏమిటో నాకు తెలుసు. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం ఏమిటి?
అధికారాలన్నీ మీ దగ్గరే పెట్టుకుంటారన్న వాదన ఉన్నది. ఈ చర్య ఎంతవరకు సబబు?
అన్ని విషయాల్లో కాకపోయినప్పటికీ కొన్ని విషయాల్లో కేంద్రీకృతపాలనే కరెక్ట్. కీలకమైన కొన్ని విషయాలపై నేనే నిర్ణయం తీసుకొంటా. ఇది కొందరికి నచ్చకపోవచ్చు. అయితే, తెలంగాణను సాధించిన వ్యక్తిగా రాష్ట్ర అవసరాలేంటో నాకు బాగా తెలుసు. అయితే, విధానపరమైన నిర్ణయాలు తీసుకొనే ముందు క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే వాటిని ప్రకటిస్తాం. అత్యంత ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రక్రియ జరుగుతుంది.
తెలంగాణ అభివృద్ధికి దోహదం చేసిన గత పరిస్థితులేంటి?
ప్రత్యేక తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండేవి. విద్యుత్తు లేదు, తాగుకు, సాగుకు నీళ్లు లేవు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడేవారు. ఈ దుస్థితిని తొలగించాలని ప్రొఫెసర్ జయశంకర్, జీఆర్‌రెడ్డి వంటి నిపుణులమందరం కూర్చొని మేధోమథనం చేశాం. ప్రణాళికలను రూపొందించాం.
రైతు సంక్షేమ పథకాలను తీసుకొచ్చి మీరు గొప్ప విజయాలు సాధించారు. ఈ స్కీమ్స్ మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయి. దానిపై ఏం చెప్తారు?
రైతు సంక్షేమ పథకాలను తీసుకురావడానికి ముందు వ్యవసాయ నిపుణులు అశోక్ గులాటితో ఎన్నోసార్లు మేధోచర్చలు జరిపాను. ధాన్యం పండించే అన్నదాతలకు ఆర్థిక సాయం అందించాలని ఆయన సలహానిచ్చారు. ఈ క్రమంలోనే ఏటా ఎకరాకు పెట్టుబడి సాయంగా రూ.10 వేల చొప్పున అందించే రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చాం. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.2 వేల చొప్పున ఆసరా పింఛను
అందిస్తున్నాం.
డబుల్ బెడ్రూం పథకం అనుకొన్న లక్ష్యాన్ని చేరలేదని, లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిపై మీ సమాధానం?
సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యేల జోక్యం ఉండకూడదని ఓ పాలసీ తీసుకొచ్చాం. ప్రజల మధ్య లాటరీ విధానంలో డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నది. ఇక అవినీతి ఎక్కడిది? 3 లక్షల డబుల్ బెడ్రూంలు కట్టిస్తామని హామీనిచ్చాం. చేశాం.
విద్యుత్తు సరఫరా విషయంలో మీ వ్యూహాల గురించి వివరిస్తారా?
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడగానే విద్యుత్తు సమస్యలను పరిష్కరించాలనుకొన్నాం. ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ర్టాల నుంచి కరెంటును కొనుగోలు చేశాం. ఇదే సమయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వతహాగా విద్యుత్తును ఉత్పత్తి చేయాలని నిర్ణయించాం. కేంద్రంతో పాటు ప్రైవేటు కంపెనీలు ఈ నిర్ణయాన్ని విమర్శించాయి. అయినా నేను పట్టించుకోలేదు. ఇప్పుడు దాని ఫలాలు తెలిసొస్తున్నాయి. పదేండ్లకు ముందు 6,500 మెగావాట్లుగా ఉన్న స్థాపిత విద్యుత్తు సామర్థ్యం ఇప్పుడు 18,453 మెగావాట్లకు చేరింది. ఫలితంగా అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయగలుగుతున్నాం.
విద్యుత్తు ప్రాజెక్టులను ప్రైవేటు కంపెనీలకు మీరు ఎందుకు అప్పగించలేదు?
పెట్టుబడుల విషయంలో రాష్ర్టాల మధ్య చాలా పోటీ ఉన్నది. అయితే, విద్యుత్తు వ్యవస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండటంతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు తక్కువ ధరకే విద్యుత్తును సరఫరా చేయగలిగాం. కంపెనీల రాకతో ఉపాధి అవకాశాలు వస్తాయి. అంతిమంగా మనకే లాభం.
రెండోసారి అధికారంలోకి వచ్చాక మీ ప్రాథమ్యాలు ఏ విధంగా ఉండేవి?
పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులపై మరింత దృష్టిసారించాం. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాం. తెలంగాణ ప్రాంతం భౌగోళికంగా భిన్నమైంది. కృష్ణా, గోదావరి జలాలను అన్ని ప్రాంతాలకు తరలించాలంటే 500 మీటర్ల ఎత్తు వరకూ ఎత్తిపోయాల్సిందే. వేరే మార్గమే లేదు. అందుకే, ఖజానాపై భారం పడినప్పటికీ లిఫ్ట్ ఇరిగేషన్ చేశాం.
అవినీతి, నాణ్యతాలేమి కారణంగానే మేడిగడ్డ బరాజ్ కుంగిపోయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దానిపై?
ప్రపంచంలోనే అతిపెద్ద మల్టి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్టులో వందల పిల్లర్లు ఉన్నాయి. అందులో ఒకటి కొద్దిగా కుంగిపోయింది. అయితే, దీని వెనుక కుట్రకోణం ఉన్నట్టు నాకు అనుమానం ఉన్నది. అందుకే పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాం. ఇక, ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎల్అండ్టీ సంస్థ చేపట్టింది. ఏదైనా సమస్య వస్తే, ఆ సంస్థే ఖర్చులు భరించి దాన్ని పరిష్కరిస్తుంది. ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి భారం ఉండదు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ.80 వేల కోట్లు అయితే, నేను రూ.లక్ష కోట్లు తీసుకొన్నానని కాంగ్రెస్ ఆరోపించడం వెర్రితనమే.
కుటుంబపాలనను మీరు ప్రోత్సహిస్తున్నారని, కుమారుడు, కుమార్తె, అల్లుడు, ఇతర బంధువులు మీ ప్రభుత్వంలో ఉన్నారన్న ఆరోపణలపై ఏమంటారు?
నిజమేంటంటే.. తెలంగాణ ఉద్యమంలో మా కుటుంబం మొత్తం పాలుపంచుకొన్నది. తెలంగాణ కోసం నా కుమారుడు, కుమార్తె తీవ్రంగా పోరాడారు. అమెరికాలో చదివి వాళ్లు మంచి ఉద్యోగం, విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఉద్యమంలో పాల్గొన్నారు. జైలుకు కూడా వెళ్లారు. తర్వాత, ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికల్లో గెలిచారు. కుటుంబపాలన అనే ఆరోపణలు అంతా పిచ్చి ఆరోపణలు. ఇక కుటుంబపాలనపై మాట్లాడుతున్న బీజేపీ.. వారసులకు ఎన్నో టికెట్లను ఇచ్చింది. యడియూరప్ప కుమారుడిని కర్ణాటకలో ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. ఇది కుటుంబపాలన కాదా?
నిజామాబాద్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ.. ఎన్డీయేలో చేరుతామంటూ 2021లో మీరు తనను అడిగారని అన్నారు. ఇది నిజమేనా?
తన మనసులోకి వచ్చినవి తనకు అనుకూలంగా మలుచుకొంటూ మోదీ అలా అబద్ధాలను స్టోరీలుగా చెప్పుకొంటూపోతే, దానికి నేనేం చేయగలను? నిజం చెప్పాలంటే, నేను ఓ సీఎంను. ఆయన ప్రధాని. కాబట్టి, కేంద్రం-రాష్ట్రం మధ్య కనీస సత్సంబంధాలు ఉంచాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. అయితే, ఎన్డీయేలో చేరాలంటూ వాళ్లు నన్ను అడిగారు. అయితే, ముందు రాష్ర్టానికి ఏదో ఒక మంచి చేయాలని నేను వాళ్లని డిమాండ్ చేశాను. అయితే, తెలంగాణకు వాళ్లు ఏ మంచీ చేయలేదు. ఒకవేళ, మోదీ ప్రధాని కాకపోతే, తెలంగాణ తలసరి ఆదాయం ఇప్పటికే, రూ.4 లక్షలకు పెరిగేది. సీఎంగా ఉన్నప్పుడు మోదీ కేంద్రం మీద ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు ఆయన గవర్నర్లు రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను కూడా తొక్కిపెడుతున్నారు. ఇది నేరపూరిత చర్యే. తెలంగాణ గవర్నర్ తమిళిసై గతంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు. బిల్లులను నిలిపేస్తూ ఆమె దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు.
సీఎంగా కేటీఆర్‌కు ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా మీరు అడిగినట్టు నిజామాబాద్ సభలో మోదీ చెప్పారుగా?
ప్రధాని మోదీకి నాకు మధ్య ప్రైవేటు సంభాషణ జరిగింది. నాకు 70 ఏండ్ల వయసు వచ్చిన తర్వాత రాజకీయాల నుంచి విరమించుకోవాలనుకొన్న అంశాన్ని మోదీకి చెప్పాను. ఈ సందర్భంగా కేటీఆర్ ఎలా ఉన్నాడని ఆయన అడిగారు. చెప్పాల్సింది చెప్పాను. ప్రధాని స్థానంలో మోదీ ఉన్నందు వల్ల కేటీఆర్‌ను ఆశీర్వదించి, సహకరించాల్సిందిగా కోరాను. ఇది ఇద్దరి మధ్య ప్రైవేటుగా జరిగిన సంభాషణ. అలాంటి విషయాన్ని ప్రజా వేదికలమీద ప్రధాని స్థాయి వ్యక్తులు బహిర్గతం చేయడమేమిటో?
ప్రధాని పనితీరుపై మీ అభిప్రాయం?
ఆయన పాలన నూటికి నూరుపాళ్లు వినాశనమే. అన్నిరంగాల్లోనూ తిరోగమనమే. చరిత్రలో ఎన్నడూ చూడనంత స్థాయికి భారత కరెన్సీ విలువ పడిపోయింది. దేశంలోని 50 శాతం పరిశ్రమలు మూతపడ్డాయి. గతంలో మేథోవలసలు జరిగితే, ఇప్పుడు పెట్టుబడులు తరలిపోతున్నాయి.
ఆరెస్సెస్, బీజేపీ హిందూత్వను సమర్థిస్తాయి. మరి మీరు?
నేను హిందువును. బహిరంగంగానే యజ్ఞాలు చేస్తాను. అయితే, రాజకీయ లబ్ధి కోసం హిందూత్వను బజారుకు లాగితే, దాన్ని అవమానించినట్టే.
బీజేపీ గెలిస్తే, బీసీ సీఎంను చేస్తామని అమిత్‌షా అన్నారు. దానిపై?
ఒకట్రెండు కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు రావు. కాబట్టే, వాళ్లకు నచ్చినట్టు ఏమైనా మాట్లాడుతారు.
ఉద్యమ సమయంలో తెలంగాణ తొలి సీఎంగా దళితుడినే చేస్తానని మీరు చెప్పారు. దానిపై ఏమంటారు?
అవును. చెప్పాను. అయితే, తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో మాకు 63 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణను ఇతరులు ముందుకు తీసుకుపోవడం సాధ్యం కాదని నాకు అందరు సలహా ఇచ్చారు. అయితే, ఇచ్చిన వాగ్దానాన్ని వెనక్కి తీసుకోవట్లేదు. సమయం వచ్చినప్పుడు తప్పక చేస్తాం.
మీ పార్టీని బీజేపీ బీ-టీమ్‌గా కాంగ్రెస్ అభివర్ణిస్తున్నది. అందుకే మీ కుమార్తె కవిత విషయంలో ఈడీ ముందుకు వెళ్లలేదంటూ ఆరోపిస్తున్నది?
అది ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసు. దీనిపై మేం న్యాయపోరాటం చేస్తున్నాం. ఇది ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించినది. తెలంగాణ ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేని వ్యవహారం. ఢిల్లీకి ఎక్కువ ఆదాయం వచ్చేలా ఆ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకువచ్చింది. అందులో స్కావ్‌ు ఎక్కడుంది? ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, నా కుమార్తె కవితకు వ్యతిరేకంగా ఈ కేసును బీజేపీ సృష్టించింది. మాకు బీజేపీతో ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు.
రాహుల్‌గాంధీని బఫూన్‌గా సంబోధించారు. భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్‌పై మీ అభిప్రాయం ఏమైనా మారిందా?
భారత్ జోడో యాత్ర ఓ పెద్ద జోక్. దాని ద్వారా ఏ సందేశం ఇస్తున్నట్టు? దేశంలో నిరుద్యోగం, పేదరికం సంగతేంటి?
ఇండియా కూటమిపై మీ అభిప్రాయం?
ఆ కూటమి ఎప్పుడో విచ్ఛిన్నమైంది. అఖిలేశ్ యాదవ్ కూటమి నుంచి బయటకు వచ్చా రు. నితీశ్ ఆ కూటమిని రోజూ విమర్శిస్తున్నారు.
మూడోసారి అధికారంలోకి వస్తే, మీ ప్రణాళికలు ఏమిటి?
ఆర్థికంగా ఇప్పటికే ఎంతో పరిపుష్ఠి సాధిం చాం కనుక, మూడోసారి అధికారంలోకి రాగానే విద్య, వైద్యంపై మరింత దృష్టిసారిస్తాం.
మూడోసారి గెలిస్తే, మీరే సీఎంగా కొనసాగుతారా?
దేశ రాజకీయాలలో నేను కీలక పాత్ర పోషించాల్సి ఉంది. అయితే, తెలంగాణలోనే ఉండి ఆ పనిచేస్తా. మహారాష్ట్ర గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుతమైన ఫలితాలు సాధించింది. మహారాష్ట్ర బీఆర్ఎస్లోకి 25 లక్షల మంది చేరారు. ఇది దేశంలోని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
కేసీఆర్ డెవలప్మెంట్ మాడల్ ఏమిటి?
భారత్ వంటి దేశంలో పేదలకు సంక్షేమ ఫలాలు అందాలి. ఇదే సమయంలో వ్యవసాయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. పారిశ్రామికాభివృద్ధి కూడా అవసరమే. అమెరికా, చైనా వంటి దేశాల్లోలేని గొప్ప వనరులు భారత్‌లో సమృద్ధిగా ఉన్నాయి. మనకు సాగుభూమి ఎక్కువ. కూలీల కొరత లేదు. అవసరాలకు మించిన నీరు ఉంది. ఈ మూడింటిని ఒకచోట చేర్చి, ప్రపంచ ఆహార మార్కెట్‌గా దేశాన్ని మార్చొచ్చు. 2024లో కేంద్రంలో వచ్చే ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని నేను విశ్వసిస్తున్నా. అబ్ కీ బార్, కిసాన్ సర్కార్.
ప్రత్యేక రాష్ట్రం ఇస్తే మీ పార్టీని విలీనం చేస్తానని సోనియాగాంధీకి మాటిచ్చి ద్రోహం చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. దీనికి మీ సమాధానం?
నిజం చెప్పాలంటే, సోనియాగాంధీనే తెలంగాణను మోసం చేశారు. తెలంగాణ ఉద్యమం సుదీర్ఘమైంది. మా పార్టీ యూపీఏలో భాగస్వామిగానూ ఉన్నది. 2004లో కేంద్రంలో అధికారంలోకి వస్తే, తెలంగాణ ఇస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ మాటమార్చింది. 2009లో నేను ఆమరణ నిరాహారదీక్షకు దిగాక, అప్పుడు ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసింది. అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రమాదంలో మరణించడంతో ఆయన కుమారుడు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేస్తున్నారు. తెలంగాణలోనూ ఇలాంటి తిరుగుబాటు చేస్తారేమోనని కాంగ్రెస్ అనుకొని తమ ఆలోచనను విరమించుకొన్నది. అయినప్పటికీ, ఎంతో పోరాడి.. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడే 2014 ఫిబ్రవరిలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో లోక్‌సభలో ప్రత్యేక రాష్ట్రం బిల్లును ఆమోదింపజేశాం. ఆ తర్వాత సోనియాగాంధీని నేను కలిశాను. ఆలస్యంగానైనా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాను. ఆమె ఎన్నికల గురించి అడిగారు. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాను. అయితే, మా పార్టీ నాయకులకు ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యే టిక్కెట్లు, నాయకత్వం అప్పగించాలని విజ్ఞప్తి చేశా. అందుకు అంగీకరించిన ఆమె.. పార్టీతో చర్చిస్తానని చెప్పారు. కానీ మరుసటి రోజు దిగ్విజయ్ సింగ్ నాకు ఫోన్ చేశారు. కాంగ్రెస్ నిబంధనల ప్రకారం సీట్ల పంపిణీ జరుగుతుందని, ఎన్నికల తర్వాత రాష్ట్ర నాయకత్వంపై అధిష్ఠానం నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ క్రమంలోనే మా పార్టీ కూడా ఒక సర్వే నిర్వహించింది. అందులో మాకు 50 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని తేలింది. దీంతో ఎన్నికలకు వెళ్లాం. ప్రజలు మాకు పూర్తి అధికారాన్ని ఇచ్చారు. అలాంటప్పుడు కాంగ్రెస్‌ని మోసం చేసినట్టు ఎలా అవుతుంది?
ప్రణాళికల్లో మీ తొలి ప్రాథమ్యాలు ఏమి ఉండేవి?
మా తొలి ప్రాథమ్యంగా మిషన్ కాకతీయను చేపట్టాం. తెలంగాణలోని చిన్న, పెద్ద చెరువులను పునరుద్ధరించడమే ఈ మిషన్ ముఖ్యోద్దేశం. కాకతీయుల కాలంలోని 75 వేల చెరువులు సమైక్యపాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. పెద్దసంఖ్యలో కనుమరుగయ్యాయి. దీంతో వాటి సంఖ్య 45 వేలకు తగ్గింది. అధికారంలోకి రాగానే, ఆ మిగిలిన చెరువులు పునరుజ్జీవం పొందేలా చేశాం. ఫలితంగా సాగుకు అవసరమైన నీరు రైతులకు అందుబాటులోకి వచ్చింది. వలసలు ఆగిపోయాయి. 2014లో 70 లక్షల టన్నులుగా ఉన్న వరిసాగు, ఇప్పుడు 2.6 కోట్ల టన్నులకు చేరింది.
శాంతిభద్రతల పరిరక్షణకంటూ యూపీ సీఎం యోగి పోలీస్ ఎన్కౌంటర్లు, బుల్డోజర్లను వినియోగిస్తున్నారు. అలాంటివి అంగీకరిస్తారా?
ప్రజాస్వామ్యంలో ఎన్కౌంటర్లు ఎంతమాత్రం వాంఛనీయం కాదు. ఇండ్లను పడగొట్టేందుకు బుల్డోజర్లను ఎగదోయడం మా పనికాదు. నేను దాన్ని బలంగా వ్యతిరేకిస్తాను. శాంతి-భద్రతల అంశాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా పోలీసు వ్యవస్థ ఉన్నది. కోర్టులు ఉన్నాయి. అన్నివర్గాల వారికోసం పనిచేయడమే మా ప్రభుత్వ విధానం. మైనార్టీలు కూడా సంతోషంగా ఉండాలన్నదే మా లక్ష్యం. అందరిలాగే వారికి కూడా అన్ని సంక్షేమ పథకాలు సమానంగా అందాలి. ముస్లింలుగా పుట్టినందుకు వాళ్లెందుకు బాధలు పడాలి?
కొత్త రాష్ట్రం అయినప్పటికీ ప్రైవేట్ కంపెనీలను ఎలా ఆకర్షించారు? ఆ ఇండస్ట్రీని ఎలా వృద్ధిచేశారు?
ఈ విషయంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర సలహాలతో పాటు భారత్‌లోనే కాదు ప్రపంచ దేశాల్లోని ఇండస్ట్రియల్ పాలసీలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. అలా అత్యద్భుతమైన టీఎస్ఐపాస్ స్కీమ్‌ను తీసుకొచ్చాం. దాని ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి. కంపెనీ ఏర్పాటుకు అవసరమైన విద్యుత్తు, నీళ్లు, భూమి వంటి 57 అనుమతులను కేవలం 15 రోజుల్లోనే ఇస్తాం. టీఎస్ఐపాస్ ద్వారా ఇప్పటివరకు రాష్ర్టానికి 22,745 పరిశ్రమలు వచ్చాయి. రూ.2.6 లక్షల కోట్ల పెట్టుబడులు సమకూరాయి. 17 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి.
పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. కాంగ్రెసేతర ఫ్రంట్ ఎందుకు?
కాంగ్రెస్ ఓ విఫల పార్టీ. వ్యవస్థ అంటూ లేని ఓ దురహంకార పార్టీ. ఆ పార్టీ విధానాలు రాష్ర్టానికి, రాష్ర్టానికి మధ్య వేర్వేరుగా ఉంటాయి. కర్ణాటకలో ఒకలా, తెలంగాణకు వచ్చి మరోలా, రాజస్థాన్ వెళ్లి ఇంకోలా చెప్తారు. జాతీయ పార్టీగా చెప్పుకొనే కాంగ్రెస్‌కు ఇది ఏమాత్రం తగదు.
తెలంగాణ ఎన్నికల ఫలితాల స్వరూపం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!


