భద్రాద్రి కొత్తగూడెం : క్లౌడ్ బరస్ట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి వచ్చిందన్నారు. క్లౌడ్ బరస్ట్‌పై ఏదో కొన్ని కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారు. కుట్రలు ఎంత వరకు నిజమో తెలియదు. ఇతర దేశాల వాళ్లు కావాలని మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారు. గతంలో లడాఖ్, లేహ్, ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతంపై కూడా క్లౌడ్ బరస్ట్ చేస్తున్నట్లు సమాచారం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.
భద్రాచలం ఐటీడీఏలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారు. భద్రాచలంలోని వరద ముంపు బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతామన్నారు. అదే విధంగా ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలకు ఎత్తైన ప్రదేశంలో రూ. 1000 కోట్లతో కొత్త కాలనీ నిర్మిస్తామని సీఎం స్పష్టం చేశారు.