Child Marriage | చట్టాన్ని రక్షించాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్‌నే దాన్ని ఉల్లంఘించాడు. బాల్య వివాహాలు నేరమని తెలిసి కూడా ఓ మైనర్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన నాయిని అనిల్ కుమార్ గౌడ్ భువనగిరిలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన అనంతగిరి మండలానికి చెందిన ఓ బాలికను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. బాల్య వివాహాలు చేసుకోవడం నేరమని తెలిసి కూడా ఓ కానిస్టేబుల్ మైనర్‌ను వివాహం చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో వారు ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు సమాచారం అందుకున్న శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) అధికారులు హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు అనిల్ కుమార్ గౌడ్‌పై బాల్య వివాహాల నిరోధక చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.