హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) చైర్మన్ కొండూరి రవీందర్రావు తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఆయనపై ఆవిశ్వాసం ప్రకటించిన బోర్డు మెజార్జీ డైరెక్టర్లు గత వారమే నోటీసులు ఇచ్చారు. జూన్ 10న అవిశ్వాస తీర్మానంపై సమావేశం జరగనున్నది. ఆలోపే రాజీనామా చేయాలని రవీందర్రావు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్కు చెందిన కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు టెస్కాబ్ చైర్మన్గా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి అనుకూలంగా మారిన డైరెక్టర్లు రవీందర్రావును చైర్మన్ పదవి నుంచి తొలగించాలని నిర్ణయించారు. బోర్డులో మొత్తం 9 మంది డైరెక్టర్లు ఉండగా ఏడుగురు ఆయనకు వ్యతిరకమైనట్టు తెలిసింది. అయితే చైర్మన్ పదవి ఉండాలంటే కాంగ్రెస్లోకి రావాలంటూ ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేసిన రవీందర్రావు కాంగ్రెస్లో చేరేందుకు అంగీకరించకపోవడంతో అవిశ్వాస అస్ర్తాన్ని ప్రయోగించినట్టు సమాచారం. ఈ పరిస్థితి వస్తుందని గమనించిన రవీందర్రావు.. గతంలోనే తన పదవికి రాజీనామా చేస్తానంటూ ఓ మంత్రికి తెలుపగా వద్దని వారించినట్టు తెలిసింది. అప్పుడు వద్దని తీరా ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టడంపై చైర్మన్ ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. అవిశ్వాసంపై తీర్మానం ప్రవేశపెట్టేలోపే టెస్కాబ్ చైర్మన్ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది.