హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): నేషనల్ పోలీసు అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ మహిళపై లైంగిక వేధింపుల కేసును పోలీసు ఉన్నతాధికారులు ఉమెన్ సేఫ్టీవింగ్కు బదిలీ చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును చేపట్టిన ఉమెన్ సేఫ్టీవింగ్ డీసీపీ లావణ్యనాయక్ జాదవ్ బుధవారం నేషనల్ పోలీసు అకాడమీకి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మొదట ఈ కేసులో బాధిత ట్రైనీ ఐపీఎస్ మహిళ వాంగ్మూలాన్ని ఉన్నతాధికారుల సమక్షంలో నమోదు చేసినట్టు సమాచారం. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలు, వాటికి సంబంధించి అందుబాటులో ఉన్న డిజిటల్, ఇతర ఆధారాలను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అకాడమీలోని ఇతర ట్రైనీ ఐపీఎస్‌లతోపాటు అధికారులను కూడా వారు విచారించినట్టు అధికారులు తెలిపారు. ఈ దర్యాప్తు సమయంలో మీడియాను అకాడమీలోకి వెళ్లనీయకుండా కొంతదూరంలోనే నిలువరించారు.
ఉదయ్‌కృష్ణారెడ్డి డిశ్చార్జి
మరోవైపు ఆత్మహత్యాయత్నం చేసిన నిందితుడు ఉదయ్‌కృష్ణారెడ్డి ఎర్రగడ్డలోని ప్రైవేట్ దవాఖాన నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. మూడురోజులపాటు చికిత్సపొందిన ఆయన దవాఖాన నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. అయితే ఉదయ్‌కృష్ణారెడ్డి అసలు ఆత్మహత్యాయత్నం చేయలేదని, ఆయ న రక్త పరీక్షల్లో ఎటువంటి విషపదార్థా లు లభించలేదని వైద్యుల పరీక్షల రిపోర్టులు సూచించినట్టు తెలిసింది. మద్యం మత్తులోనే ఆయన అపస్మారక స్థితికి చేరినట్టు వైద్యులు ప్రాథమికంగా చెప్పడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఉదయ్ పేరుతో వైరల్ అయిన సూసైడ్ నోట్ గురించి కూడా తనకు గుర్తు లేదని ఉదయ్ చెప్పారని వైద్యులు చెప్పడంతో పోలీసులు ఆ లేఖను స్వాధీనం చేసుకొని రాసిందెవరో ఆరా తీస్తున్నారు. పోలీసులు ఆయన వాంగ్మూలం కూడా రికార్డు చేయనున్నట్టు తెలిసింది.