రంగారెడ్డి జిల్లా కోర్టులు, అక్టోబర్ 7: పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది కోర్టులో మెమో దాఖలు చేశారు. జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డును అందుకునేందుకు ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నదని జానీ మాస్టర్ విన్నవించడంతో ఇటీవల కోర్టు ఆయనకు 4 రోజుల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. కానీ, అనుహ్యంగా నిర్వాహకులు ఆ అవార్డును రద్దు చేయడంతో జానీ మాస్టర్ ఢిల్లీ వెళ్లలేదు. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది దాఖలు చేసిన మెమోను కోర్టు అనుమతించింది. కాగా, ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం జానీ మాస్టర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 9కి వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.