MLA Vivekananda | హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు. ఈ అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేర్కొన్నారు. ఎమ్మెల్యే వివేకానంద తెలంగాణ భవన్లో ఇవాళ మీడియాతో మాట్లాడారు.
పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ స్పీకర్ దగ్గర ఏడాదిన్నరగా పెండింగ్లో ఉంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడం చరిత్రాత్మకం అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈ తీర్పు చెంపపెట్టు లాంటింది. ఉపఎన్నికలు ఎలా వస్తాయి అధ్యక్షా అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును తప్పుపట్టేలా వ్యాఖ్యానించారు. ఇపుడు ఉపఎన్నికలు ఎలా వస్తాయో సుప్రీం కోర్టు చెప్పింది అని వివేకానంద తెలిపారు.
సీఎం అధికార మదంతో రాచరికాన్ని తలపించేలా మాట్లాడిన వ్యాఖ్యలకు విరుద్ధంగా సుప్రీం తీర్పు ఇచ్చింది. సుప్రీం తీర్పు మీద ఏ మాత్రం నమ్మకమున్నా పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. పార్టీ మారగానే ఎమ్మెల్యేలు, ఎంపీలు సభ్యత్వాన్ని కోల్పోయేలా చట్టం తెస్తామని ఏఐసీసీ మేనిఫెస్టోలో చెప్పారు. పాంచ్ న్యాయ్ సూత్రాల్లో అది ఒకటని రాహుల్ చెప్పారు. ఏ మాత్రం తాను మేనిఫెస్టోలో పెట్టిన దానిపై గౌరవమున్నా రాహుల్ ఎమ్మెల్యేల అనర్హత వేటు కోసం చొరవ చూపాలి అని వివేకానంద పేర్కొన్నారు.
ఢిల్లీలో రాహుల్ గాంధీది ఓ మాట.. గల్లీలో రేవంత్ రెడ్డిది ఇంకో మాట. ద్వంద్వ ప్రమాణాలకు కాంగ్రెస్ చిరునామాగా మారింది. రేవంత్ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి వ్యతిరేకంగా సుప్రీం తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ ఆహ్వానిస్తుంది. ఇక మూడు నెలలు ఆగకుండా స్పీకర్ వెంటనే తన నిర్ణయం ప్రకటించాలి. సుప్రీంకోర్టు తాజా తీర్పు మా పార్టీ తొలి విజయం.. ఈ విజయ పరంపర కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇకనైనా బుద్ది తెచ్చుకుని వ్యవహారించాలి అని ఎమ్మెల్యే వివేకానంద మండిపడ్డారు.