హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): అలంపూర్ నియోజకవర్గంలోని లిఫ్ట్ స్కీమ్‌లను తక్షణం పునరుద్ధరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు డిమాండ్ చేశారు. ఎర్రమంజిల్ జలసౌధలో ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులను సోమవారం ప్రత్యేకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలోని సాగు, తాగునీటి సమస్యలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ అలంపూర్ నియోజవర్గంలోని రైతులు ప్రధానంగా ఎత్తిపోతల పథకాలపై ఆధారపడి ఉన్నారని వివరించారు.
అందులో ఉటూర్, క్యాతూ ర్ లిఫ్ట్‌లు ప్రధానమని, వాటికింద 10,000 ఎకరాల ఆయకట్టుతోపాటు, అనేక గ్రామాలకు తాగునీరు అందుతున్నదని వివరించారు. అయితే ఆయా ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పంపులు, ట్రాన్స్ ఫార్మర్లలోని రాగి తీగలు, ఆయిల్‌ను దొంగలు అపహరించారని తెలిపారు. దీంతో లిఫ్ట్‌లు పనిచేయని దుస్థితి నెలకొన్నదని వాపోయారు. ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదురొంటున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయా లిఫ్ట్ స్కీమ్‌లను తక్షణం పునరుద్ధరించాలని, రైతుల ప్రయోజనాలను కాపాడాలని సూచించారు.