హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రజాసమస్యలపై నిత్యం ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో రేవ్ పార్టీ జరిగిందని, విదేశీ మద్యం దొరికిందంటూ పోలీసులను అడ్డంపెట్టుకొని డ్రామాలడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్ బావమరిది ఇటీవల నిర్మించుకున్న ఇంటిలో గృహప్రవేశం సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి దావత్ చేసుకుంటే చట్టవ్యతిరేక వ్యవహారంలా చిత్రీకరించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్కడ 70 ఏండ్ల వయస్సున్న రాజ్ పాకాల తల్లి, చిన్నపిల్లలు కూడా ఉన్నారని పోలీసులు, మీడియా విడుదల చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నదని తెలిపారు.
అక్కడికి వెళ్లిన ఎైక్సెజ్ సీఐ, ఎస్వోటీ ఆఫీసర్ ఇక్కడ విదేశీ మద్యం, డ్రగ్స్ దొరకలేదంటూ స్పష్టంగా చెప్పినా దుష్ప్రచారానికి దిగడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. జన్వాడలో దావత్ జరిగితే రాయదుర్గంలోని రాజ్ పాకాల ఇల్లు ఓరియంట్ విల్లాలో సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ‘వాళ్లేమైనా మద్యం వ్యాపారులా? అక్కడికు వెళ్లిన లాయర్లు, నాయకులను ఇష్టమొచ్చినట్టు ఎత్తిపడేయడమేంటి? అక్కడ దొరికిందేంటి? పోలీసులు గంటగంటకూ ఎఫ్ఐర్లు మార్చడమెందుకు? ఇంత భయానక వాతావరణం సృష్టించడమెందుకు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదంతా చూస్తుంటే ఇందులో కుట్రకోణమని స్పష్టంగా అర్థమవుతున్నదని చెప్పారు. మీడియా వాళ్లకు తెలియకుండానే వాళ్ల మీడియా ఆఫీసుల నుంచి వీడియోలు బయటకు ఎలా వస్తున్నాయో అర్థం కావడంలేదన్నారు.
కుటుంబసభ్యులు చేసుకున్న దావత్లో ఇతరులెవరూలేరని వెల్లడైనా, కేటీఆర్‌ను బద్నాం చేసేందుకు భూతద్ధంలో చూపి చిలువలు, పలువలు చేయడం, ప్రపంచం బద్ధలైనట్టు మీడియాలో ప్రచారం చేయడం దుర్మార్గమని విమర్శించారు. ‘రాజకీయాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని కచ్చితంగా నిలదీస్తాం. ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా సంక్రమించింది.. కానీ ఈ ప్రభుత్వం వ్యక్తిగత కక్షలకు దిగడం, బురదజల్లడం మంచిది కాదు’ అని హితవు పలికారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని సరైన సమయంలో తిప్పికొడతారని హెచ్చరించారు. ఈ విషయంపై చట్టపరంగా పోరాడతామని తేల్చిచెప్పారు. ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు పక్కన బెట్టి ప్రజాసమస్యలపై దృష్టిపెట్టాలని చురకలంటించారు.
ఫాంహౌస్‌కు సొంతింటికి సంబంధమేంటి?: మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
కేటీఆర్ బావమరిది సొంతంగా ఫాంహౌస్ కట్టుకొని గృహప్రవేశం చేశారని, అక్కడ చిన్న దావత్ చేస్తే ఏదో జరుగుతున్నదంటూ జన్వాడలో దాడులు చేసిన పోలీసులకు ఏమీ దొరక్కపోతే ఆయన సొంతింట్లో దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిలదీశారు. కేటీఆర్‌పై కక్ష తీర్చుకొనేందుకు ఆయన కుటుంబసభ్యులను బలిచేసే కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్ పాకాల ఇంట్లో ఏదో దొరికనట్టు చూపెట్టి కేసులు కట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వ పెద్దలు మానిటరింగ్ చేస్తున్నట్టు తనకు సమాచారమున్నదని చెప్పారు. పోలీసులు లాయర సమక్షంలో సోదాలు నిర్వహించాలని, మీడియా కెమెరాలను అనుమతించాలని డిమాండ్ చేశారు.
కక్షల సంస్కృతి తేవద్దు: మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్
తెలంగాణలో ఎవరి ఇంట్లో పండుగ జరిగినా దావత్‌లు సర్వసాధారణమని, రాజ్ పాకాల ఇంట్లో జరిగిన విందును పెద్దది చేయడం ఎంతవరకు సమంజసమని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనివెనుక భారీ కుట్ర కనపడుతున్నదని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో కక్షపూరిత రాజకీయాలు లేవన్నారు. ఇప్పుడు కక్షల సంస్కృతిని కొత్తగా తేవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. మహబూబ్‌నగర్‌లో పదిమందిని చేరదీసి అన్నంపెట్టే తన తమ్ముడిని లేనిపోని ఆధారాలు సృష్టించి అరెస్ట్ చేశారని ఆక్షేపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్వేషపూరిత రాజకీయాలను పక్కనబెట్టి ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధిపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్‌ను బద్నాం చేసేందుకే: సబితాఇంద్రారెడ్డి
ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తున్న కేటీఆర్‌ను బద్నాం చేసేందుకే ఆయన బావమరిది ఇంట్లో సర్కారు పెద్దలే వెనకుండి దాడులు చేయిస్తున్నారని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. ‘తెలంగాణలో ఎవరూ శుభకార్యాలు చేసుకోవద్దా? దావత్‌లు పెట్టుకోవద్దా?’ అంటూ ప్రశ్నించారు. నిన్న మొన్న పోలీసు కుటుంబాలు రోడ్డెక్కితే ఇక్కడే ఉండి స్పందించని బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. ఇప్పుడు రాజ్ పాకాల ఇంటికి సంబంధించిన వీడియోలు మీడియాకు రిలీజ్ చేయడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. రాజ్ పాకాల ఇంట్లో సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు.