టేక్మాల్: మెదక్ జిల్లా టేక్మాల్ మండలానికి చెందిన రెండు నెలల చిన్నారి లింగంపల్లి సువిక్ష నందన ( Suviksha Nandana ) అత్యంత పిన్న వయసులోనే అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పింది. కేవలం 2 నెలల 13 రోజుల వయసులోనే నిటారుగా ఉన్న స్థితిలో తలను పైకి ఎత్తడం, ఇరువైపులా సులువుగా తిప్పడం వంటి ప్రత్యేక శారీరక సామర్థ్యాన్ని ప్రదర్శించినందుకు గాను ప్రతిష్టాత్మక ‘బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ ( Book of World Records ) సంస్థ చిన్నారి ప్రతిభను అధికారికంగా గుర్తించింది.

చిన్నారి ప్రదర్శించిన అద్భుతమైన తల నియంత్రణ, మెడ బలం, సమతుల్యత, సమన్వయం వంటి అంశాలను నిశితంగా పరిశీలించిన అనంతరం రికార్డు నిర్వాహకులు ఈ ఘనతను ధృవీకరించి వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్, రికార్డ్ హోల్డర్ గుర్తింపు పత్రం, మెడల్ ,ప్రత్యేక అవార్డును ప్రదానం చేశారు. సువిక్ష నందన తల్లిదండ్రులు లింగంపల్లి రజిత, జనార్ధన్ ఇద్దరూ తెలంగాణ వ్యవసాయ శాఖలో వ్యవసాయ విస్తరణ అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు. తమ కూతురు పసిప్రాయంలోనే ప్రపంచ రికార్డు సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.