హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు కోతల్లేవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. విద్యుత్తు డిమాండ్ అమాంతం పెరిగినా కోతల్లేకుండా విద్యుత్తును సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ జ్యోతిబాఫూలే ప్రజాభవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్ర చరిత్రలోనే పీక్ విద్యుత్తు డిమాండ్ 19,892 మెగావాట్లను రాష్ట్రం అధిగమించిందని చెప్పారు.
మన కంటే పెద్ద రాష్ట్రమైన కర్ణాటకలో పీక్ డిమాండ్ 20 వేలు, పొరుగున ఉన్న ఏపీలో పీక్ డిమాండ్ 15వేల మెగావాట్లు మాత్రమే నమోదైందని తెలిపారు. డిమాండ్ పెరిగినా వినియోగదారులకు ఇబ్బందుల్లేకుండా కరెంట్ సరఫరా చేస్తున్న విద్యుత్తు సంస్థలను, సిబ్బందిని అభినందించాల్సింది పోయి కొందరు విమర్శించడం సరికాదని పేర్కొన్నారు. ట్రాన్స్కో సహా విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించే ఆలోచన తమకు లేదని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేస్తామని తెలిపారు. వ్యవసాయానికి 8-9 గంటలు కూడా విద్యుత్తు సరఫరా కావడం లేదు, గంటల తరబడి కోతలు విధిస్తున్నారని విలేకరులు ప్రస్తావించగా, అలాంటిదేమీ లేదని డిప్యూటీ సీఎం కొట్టిపారేశారు.
రైతులు సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్న విషయాలే అందుకు నిదర్శనాలని, బుధవారం కూడా రాష్ట్రంలో పలుచోట్ల రైతులు సబ్స్టేషన్ల ఎదుట ధర్నాలు చేశారని మళ్లీ విలేకరులు భట్టిని ప్రశ్నించినా, ఆయన నుంచి కరెంట్ కోతలు లేవన్న సమాధానమే వచ్చింది. భవిష్యత్తులో కోతలు పెరుగుతాయా? అంటూ విలేకరుల ప్రశ్నకు పరిస్థితిని బట్టి చూస్తామని చెప్పారు. ఉదయం రెండు, సాయంత్రం రెండు గంటలు కట్ చేయాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతుందని విలేకరులు చెప్పగా, ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పడం గమనార్హం.