హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): జీఎస్టీ సంసరణలను స్వాగతిస్తూనే రాష్ర్టాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార కేంద్రాన్ని కోరారు. నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి అనుసరణ ప్రక్రియను సరళీకరించడంతోపాటు, ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేసే వారిని ఉపేక్షించవద్దని స్పష్టంచేశారు. ఢిల్లీలో గురువారం నిర్వహించిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
తెలంగాణ సొంత పన్ను ఆదాయంలో జీఎస్టీ వాటా సుమారు 35శాతం ఉన్నదని తెలిపారు. మోటర్ వాహనాలు, క్యాపిటల్ గూడ్స్, ఇన్పుట్ సర్వీసుల రీఫండ్లకు సంబంధించిన మార్పులు చేపట్టే ముందు వాటి పూర్తి ఆర్థిక ప్రభావాన్ని రాష్ట్రాలకు వివరించాలని కోరారు. వాహనాల విషయంలో కేంద్రం అందించిన అంచనాల ప్రకారం తెలంగాణకు ఏడాదికి సుమారు రూ.800 కోట్ల ఆదాయ ప్రభావం ఉంటుందని, రాష్ట్ర సొంత అంచనాల ప్రకారం ఈ నష్టం రెట్టింపు కంటే ఎకువగా ఉండే అవకాశం ఉన్నదని తెలిపారు. స్రాప్ రంగం, గుర్తింపు దొంగతనం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి, పేద ప్రజల ప్రయోజనాలను కాపాడే కార్యాచరణను రూపొందించేందుకు జీఎస్టీ కౌన్సిల్ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.