హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): రేవంత్ కాంగ్రెస్‌లోనే రాజకీయ జన్మత్తారా? అనేక పార్టీలు మారిన రేవంత్.. కాంగ్రెస్ నుంచి ఇతర నేతలు వెళ్లిపోయినప్పుడు ఇలా ఎందుకు స్పందించలేదు? బీసీలంటే రేవంత్‌కు ఇంత చులకనా? అంటూ రేవంత్‌రెడ్డిపై రాష్ట్రంలోని బీసీ వర్గాలు ప్రశ్నల కొడవళ్లు విసురుతున్నారు. పొన్నాల లక్ష్మయ్య ను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు బీసీలను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి.
రేవంత్, కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీసీలు హెచ్చరించారు. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దాదాపు అన్ని జిల్లాల్లో బీసీ వర్గాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలు సైతం భగ్గుమన్నారు. రేవంత్ వ్యాఖ్యలు అగ్రకుల దురహంకారానికి నిదర్శమని పలు బీసీ సంఘాలు నిరసన వ్యక్తంచేశాయి. రేవంత్ వ్యాఖ్యలు వెనక్కితీసుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని, క్షమాపణ చెప్పకపోతే అడ్డుకొని తీరుతామని అల్టిమేటం జారీ చేశాయి.
రేవంత్ కాంగ్రెస్‌లోనే రాజకీయ జన్మెత్తారా?
పార్టీలు మారటంపై రేవంత్ మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్ ఇలా తన రాజకీయ అవసరాల కోసం దేశంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీల్లో చేరిన రేవంత్.. పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరో పార్టీలో చేరేందుకు నిర్ణయించుకోవడం తప్పెలా అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్ పార్టీలు మారొచ్చుకానీ, ఇతరులు మారకూడదా? అని నిలదీస్తున్నాయి.
బీసీలంటే రేవంత్‌కు చిన్నచూపెందుకు?
రేవంత్‌రెడ్డికి మొదటి నుంచీ బీసీలంటే గిట్టదని బీసీ సంఘాల నేతలు విమర్శించారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి తమకు పార్టీలో గౌరవం ఇవ్వడం లేదని గాంధీభవన్ సాక్షిగా పలువురు బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలూ ఉన్నా యి. బీసీలను అణచివేయడమే రేవంత్ ఎజెండా అని కాంగ్రెస్‌లోని బీసీ నేతలు మం డిపడుతున్నారు. పార్టీ కోసం కష్టపడి, పార్టీని నిలబెట్టిన బీసీ నేతలు తమ జీవితాలను ధారపోస్తే.. రేవంత్ తన అగ్రకుల ఆధిపత్యంతో బీసీలను అణచివేస్తున్నారని, వారం పది రోజులుగా ఆ పార్టీలో జరుగుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శమని పలు బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
తనవర్గం పార్టీ వీడితే నోరెక్కడ పోయింది?
తన సామాజికవర్గం నేతలు పార్టీని వీడితే ఒప్పు.. బీసీలు వీడితే తప్పా? అంటూ రేవంత్‌పై బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వంటివారు కాంగ్రెస్‌ను వీడినప్పుడు రేవంత్ నోరు ఎక్కడికి పోయిందని బీసీలు నిలదీస్తున్నారు. బీసీలను కాంగ్రెస్ పార్టీ బానిసలుగా చూస్తున్నదా? అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. తక్షణమే పొన్నాలకు, బీసీ వర్గాలకు రేవంత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ కోసం బీసీలు చావాలా?
పొన్నాల రాజకీయ అనుభవమంత వయసులేని రేవంత్ ‘సిగ్గు ఉండొద్దా? చావుదలకు పార్టీ మారటం ఏమిటి? అని చేసిన వ్యాఖ్యలపై బీసీలు ఆగ్రహానికి గురయ్యారు. కాంగ్రెస్ కోసం బీసీలు చావాలా? ఇదెక్కడి సం స్కారం? అని ఆగ్రహించారు. సుదీర్ఘ కాలం పార్టీలో పనిచేసిన నాయకుడిపై వ్యక్తిగత ఆరోపణలు సరికాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. కనీసం వయసు కన్నా విలువ ఇవ్వాల్సి ఉండేదని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని హితవుపలికారు.
కాంగ్రెస్ మూల్యం చెల్లించుకుంటుంది
రేవంత్ తన అగ్రకుల అహంకారాన్ని మరోసారి చాటుకున్నారు. రేవంత్ వ్యాఖ్యలు మా జాతిని తీవ్రంగా కలచివేస్తున్నాయి. బీజేపీ నుంచి టీడీపీ, టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన రేవంత్ కూడా పార్టీలు మారడంపై మాట్లాడటం సిగ్గుచేటు. రేవంత్ అగ్రకుల అహంకారానికి కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
– పుట్టం పురుషోత్తం, మున్నూరుకాపు సంఘం ఎఫెక్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్