హైదరాబాద్ : సోషల్ ఎంటర్ప్రెన్యూవర్షిప్(ఎస్ఈ)ను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన బాల వికాస ఇంటర్నేషనల్ సెంటర్(బీవీఐసీ) తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ)తో కలిసి ఏప్రిల్ 8న కీసరలోని బాలవికాస ఇంక్యుబేషన్ ప్రాంగణంలో ‘ఇంపల్స్ 2022’ పేరుతో సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సదస్సును ఏర్పాటు చేయనుంది. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎకోసోసిస్టంను బలోపేతం చేయడంతోపాటు భాగస్వాముల మధ్య సమన్వయం ఏర్పాటు చేసే ఉద్దేశంతో సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్, ముంబై), ఐఎస్బీకి చెందిన ఐ-వెంచర్, టీ-హబ్, వీ-హబ్, కాకతీయ శాండ్బాక్స్ తదితర సంస్థలు కూడా తమ సహకారం అందిస్తున్నాయి. గురువారం సచివాలయంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సమ్మిట్‌కు సంబంధిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. 50కిపైగా సంస్థలతోపాటు సామాజిక ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు పాల్గొని, ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. సదస్సు స్టార్టప్‌ల ప్రదర్శనలకే పరిమితం కాకుండా సామాజిక పెట్టుబడిదారులు, సంస్థలను ఒకేచోట చేర్చడంవల్ల ఎకోసిస్టంను మరింత పటిష్టం చేసేందుకు దోహదపడుతుందని జయేశ్ రంజన్ చెప్పారు.
బాలవికాస కార్యనిర్వాహక సంచాలకులు శౌరిరెడ్డి మాట్లాడుతూ, ఎస్ఈ ఇకోసిస్టంను ఒకేచోటుకు చేర్చే ఈ సదస్సు సందర్భంగా సామాజిక, వ్యాపార రంగాలకు చెందిన ఎన్నో ఆసక్తికర చర్చలు జరుగుతాయని, కొత్త భాగస్వామ్యాలు ఏర్పడేందుకు ఆస్కారముందని చెప్పారు. బాల వికాస లక్ష్యం మేరకు సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని వివరించారు. చీఫ్ ఇన్నోవేషన్ అధికారి శాంత తౌటం, బాల వికాస సీనియర్ డైరెక్టర్ రాహుల్ భరద్వాజ్, బాల వికాస బోర్డు సభ్యులు రమణ గుప్తా పాల్గొన్నారు.