హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాలు త్వరలో జరిగే అవకాశం ఉన్నది. ఫిబ్రవరి 3 నుంచి 12 వరకు జరిగిన బడ్జెట్ సమావేశాల అనంతరం తిరిగి 6 నెలలకు అసెంబ్లీ సమావేశం కావాల్సి ఉంది. ఆ గడువు ఆగస్టు 11 కావడంతో ఆనెల మొదటి వారంలో గానీ, రెండో వారం మొదటి రోజుల్లో గానీ నిర్వహించే అవకాశాలున్నట్టు విశ్వసనీయ సమాచారం.
గత బడ్జెట్ సమావేశాల్లో శాసనసభ 7 రోజులపాటు, శాసనమండలి 5 రోజులపాటు నిర్వహించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారాన్ని చేపట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, వాటి ప్రభావ ఫలితాలపై సీఎం కేసీఆర్ వెల్లడించనున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.