హైదరాబాద్ : ఈ నెల 21న నిర్వహించనున్న బల్కంపేట ఎల్లమ్మ ( Balkampet Yellamma) అమ్మవారి కళ్యాణం, 22న జరగనున్న రథోత్సవం సందర్భంగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) అధికారులను ఆదేశించారు.
శనివారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఏర్పాట్లపై చర్చించారు. ఈ వేడుకలకు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తారని వెల్లడించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు. ప్రజలు సంతోషంగా జరుపుకునే వేడుకకు ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెట్టొద్దని అధికారులకు స్పష్టం చేశారు.
ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని, నిరంతర పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రథోత్సవం సందర్భంగా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆలయ పరిసరాలలో ప్రత్యేక హెల్త్ క్యాంప్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి, డీసీ సుజాత, వాటర్ వర్క్స్ జీఎం సతీష్, ఎలక్ట్రికల్ డీఈ
కిషోర్, ఆర్ అండ్ బి డీఈ మనోహర్, లా అండ్ ఆర్డర్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ మహేష్, తదితరులు పాల్గొన్నారు.