హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): సివిల్ సర్వీసెస్-2026 పరీక్షకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఎస్టీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నామని గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు తెలిపారు. ఈ నెల 14 నుంచి జూలై 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దరఖాస్తుదారుల వార్షిక ఆదాయ పరిమితి రూ. 3లక్షలలోపు ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు studycircle. cgg.gov.in వైబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్దేశించారు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నామని వివరించారు. స్టడీ మెటీరియల్ సైతం సమకూర్చుతామని తెలియజేశారు. మరిన్ని వివరాలకు 6281766534 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు.
సకుర సైన్స్ ఎగ్జిబిషన్‌కు ముగ్గురు రాష్ట్ర విద్యార్థులు
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : జపాన్‌లో నిర్వహించే సకుర సైన్స్ ప్రోగ్రామ్‌కు రాష్ర్టానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇన్స్పైర్ జాతీయ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు జపాన్‌లో తమ ఆవిష్కరణలు ప్రదర్శించే అవకాశాన్ని దక్కించుకున్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థి ఏ శివారెడ్డి, మంచిర్యాలలోని శ్రీచైతన్య పాఠశాల విద్యార్థి సాయి శ్రీవల్లి, కరీంనగర్‌లోని పారమిత హెరిటేజ్ స్కూల్ విద్యార్థి శుభశ్రీ సాహు ఎంపికైనట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జీ రమేశ్ తెలిపారు. వీరు 17 నుంచి 21 వరకు జపాన్‌లో నిర్వహించే ప్రదర్శనల్లో పాల్గొంటారని తెలిపారు. 2016 నుంచి ఇప్పటి వరకు 21 మంది విద్యార్థులు సకుర ప్రోగ్రామ్‌లో జపాన్ను సందర్శించారు.