Telangana | హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే తెలంగాణ రాష్ట్ర పరిపాలన సాగుతున్నదా? అమరావతిలో ఉండి ఆయన కన్ను గీటితేనే హైదరాబాద్ సెక్రటేరియట్లో ఫైళ్లు కదులుతున్నాయా? ఓ అధికారికి కీలక బాధ్యతలు కట్టబెట్టడం వెనుక పొరుగు రాష్ట్రం నేత హస్తం ఉన్నదా? ఆయన ముందుచూపుతోనే ఆంధ్రలోని రిటెర్డ్ ఐఏఎస్‌లను వ్యూహాత్మకంగా తెలంగాణలో కీలక పోస్టుల్లోకి చొప్పిస్తున్నా రా? తెలంగాణ సీఎంవో పూర్తిగా ఆ.. బాబు చేతుల్లోకి వెళ్లిపోయినట్టేనా? తెలంగాణ భవిష్యత్తు నిర్ణయాలు ఇకపై అమరావతిలోనే ఖరారవుతాయా? ఉర్సా కంపెనీతో వేల కోట్ల ఒప్పందం, గోడి ఇండియా గోడ కంపెనీతో ఒ ప్పందం వెనుక ఆయన ఆదేశాలే ఉన్నాయా? మూసీ రివర్‌ఫ్రంట్ పనులకు మెయిన్హార్ట్ను పంపింది ఆయనేనా? అంటే అన్ని ప్రశ్నలకు ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తున్నది. చక్రం తిప్పటంలో సిద్ధహస్తుడిగా పేరున్న పొరుగు రాష్ట్ర సీఎం తెలంగాణ పరిపాలనలో చక్రం తిప్పుతున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మన గుట్టు పొరుగు రాష్ర్టానికి..
తెలంగాణలో తెలివిగల అధికారులే లేరన్నట్టు ఇక్కడి కీలక పదవుల్లో అత్యధికం ఏపీ మూలాలున్న వ్యక్తులకు అప్పగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ వచ్చిన కొత్తలో కృష్ణా, గోదావరి నదీ జలాల వాటా కోసం ఏపీ తరఫున కొట్లాడిన ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్‌దాస్‌ను తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించారు. కీలక నిర్ణయాలతో పరిపాలనను పరుగులు పెట్టించే సీఎం ముఖ్యకార్యదర్శి పోస్టును తాజాగా వీఆర్ఎస్ తీసుకున్న ఆంధ్ర క్యాడర్ ఐఏఎస్‌కు అప్పగించారు. దీంతో తెలంగాణ పరిపాలన గుట్టంతా రాచమార్గంలో ఆంధ్రా పాలకుల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ కైంప్లెంట్ అథారిటీ చైర్మన్‌గా ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ శివశంకర్‌రావును నియమించారు. ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలంలోని సాకుర్రు గ్రామం. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అప్పిలేట్ అథారిటీ చైర్మన్‌గా ఏపీకి చెందిన జస్టిస్ సాంబశివరావును నియమించారు. రాష్ట్ర మానవ హకుల కమిషన్ సభ్యుడిగా ఆంధ్ర మూలాలున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ బీ కిశోర్‌ను నియమించారు. కీలక పదవులు అన్నీ ఆంధ్ర అధికారులతో నింపటంతో తెలంగాణ ప్రభుత్వ జీవోలు, ప్రయోజనాలు, పథకాల రహస్యం, ప్రభుత్వ వ్యూ హాలు అంతా ఆంధ్రా పాలకుల చేతిలో పెట్టినట్టు అయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిండాముంచినోడి చేతికే నీళ్ల బాధ్యతలు…
కీలకమైన జలవనరుల్లో వాటా కోసం ఆంధ్రతో మనకు నిత్యం ఘర్షణ జరుగుతున్నది. ప్రధానంగా కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగుతున్నది. గోదావరి జలాల్లో వాటాల మీద కూడా ఇదే తరహా వివాదాలు నడుస్తున్నాయి. ఇలాంటి సంక్లిష్ట సమయంలో పొరుగు రాష్ట్రం ఎత్తులకు జిత్తులకు అందకుండా ఎన్నో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. కానీ జల రంగానికి సంబంధించిన కీలకమైన పోస్టులో, శాసన నిర్ణయాలు తీసుకొనే మరో కీలక పోస్టులో కూడా పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన విశ్రాంత ఐఏఎస్ అధికారులనే నియమించారు. గోదావరి పరివాహకంలోని 7ముంపు మండలాలను ఆంధ్రలో కలిపిన ఆలోచన ఆయనదేనని అప్పట్లో ప్రచారం జరిగింది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కింద కేవలం 299 టీఎంసీలు రావటానికి ఆదిత్యనాథ్‌దాస్ వ్యూహమే కారణం అన్న ఆరోపణలున్నాయి. కృష్ణా పరివాహకంలో 68.5 శాతం బేసిన్ ఉన్న తెలంగాణకు 299 టీఎంసీలు, 31.5 శాతం మాత్రమే బేసిన్ ఉన్న ఆంధ్రకు 512 టీఎంసీల నీళ్లను కేటాయించటంలో కీలకంగా వ్యవహరించినది కూడా ఆ యనేనన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆయనకే తెలంగాణ జలాల బాధ్యతను అప్పగించటంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
షెడ్యూల్ ఆస్తులు ఏం కావాలి?
ప్రభుత్వ ఆధీనంలోని రోడ్డు రవాణా సంస్థ ఆస్తులపై ఆంధ్ర ప్రభుత్వం పేచీలు పెడుతున్నది. హైదరాబాద్‌లో ఉన్న ఆర్టీసీ ఆస్తుల్లో వాటా కావాలని అడుగుతున్నది. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు ఏపీఎస్ఆర్టీసీ డిమాండ్‌ను నిరాకరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం హైదరాబాద్ రాజధాని నగరం పూర్తిగా తెలంగాణకు చెందుతుంది. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో జాబితా చేసిన వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన, అనేక అంశాలపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు 9వ షెడ్యూల్లో జాబితా చేశారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కంపెనీలు, కార్పొరేషన్లు ఉన్నాయి.
పదో షెడ్యూల్లో ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ యూనియన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఏపీ ఫారెస్ట్ అకాడమీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ వంటి 107 శిక్షణా సంస్థలు ఉన్నాయి. అయితే చంద్రబాబు పంపిన అధికారులు తెలంగాణ ప్రయోజనాల కోసం ఏమేరకు పనిచేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.‘మెయిన్‌హార్ట్’కు అక్కడి నుంచే బీజం…ఉగ్రవాదులను ఎగదోస్తూ పకలో బల్లెంలా మారిన పాకిస్థాన్‌తో ఇప్పుడా.. ఇంకాసేపటికా యుద్ధం అన్నట్టు పరిస్థితులు ఉన్నాయి. ఇక పాకిస్థాన్‌తో దోస్తీ చేస్తున్న చైనా అవకాశం ఉన్నప్పుడల్లా విషాన్ని కుక్కుతున్నది. భారతదేశ అస్థిత్వానికి ప్రమాదకరంగా మారిన ఈ రెండు దేశాలతో చం ద్రబాబు తెలంగాణకు బంధం కలిపినట్టు తెలుస్తున్నది.
సీఎం రేవంత్ సరారు తీసుకొచ్చిన ‘మూసీ రివర్‌ఫ్రంట్’ ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధుల్లో మెజార్టీ భాగాన్ని చైనా కేంద్రంగా పనిచేస్తున్న న్యూ డెవలప్మెంట్ బ్యాంకు సమకూర్చనున్నట్టు విశ్వసనీయంగా సమాచారం. ఈ బ్యాంకు డైరెక్టర్ జనరల్ డీ జగదీశ పాండ్యన్, సీఎం రేవంత్‌రెడ్డిని గత ఏడాది ఫిబ్రవరిలో సచివాలయంలో కలిశారు. మూసీ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను సమకూరుస్తామని హామీనిచ్చారు. ఈ పాండ్యన్ ఏపీ సీఎంకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్‌కు మంచి స్నేహితుడట. ఈ ఈశ్వరన్ సలహా మేరకు, చంద్రబాబు సూచనలతో పాండ్యన్ రేవంత్‌రెడ్డితో సమావేశమైనట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అదే పాండ్యన్ గత ఏడాది జూలై 26న ఏపీ సీఎంతో కూడా సమావేశమై అమరావతి అభివృద్ధి గురించి మాట్లాడటం గమనార్హం. ఆయన సిఫారసు మేరకే మెయిన్‌హార్ట్‌కు మూసీ సుందరీకరణ పనులు అప్పగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ మెయిన్‌హార్ట్ కంపెనీకి పాకిస్థాన్ మూలాలున్నాయి. అయితే చంద్రబాబు సిఫారసు మేరకే ఊరు పేరు లేని ఉర్సా అనే కంపెనీతో మన ప్రభుత్వం రూ.5000 కోట్లతో ఒప్పందం చేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.