Bhadrachalam | భద్రాచలం, మార్చి 13: శ్రీరామనవమి మహోత్సవాల ప్రారంభం వేళ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. శుక్రవారం నుంచి ఆలయంలో వేడుకలు ప్రారంభం కావాల్సి ఉండగా అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చక బృందం గురువారం రాత్రి నిలిపివేసింది. వివరాలిలా ఉన్నాయి. ఓ భక్తుడు అభిమానంతో అందించిన నగదును రామాలయ ఉప ప్రధాన అర్చకుడు శ్రీనివాస రామానుజం స్వీకరించారన్న కారణంతో అతడిపై ఆలయ ఈవో రమాదేవి ఆగ్రహం వ్యక్తంచేశారు. చర్యల్లో భాగంగా రెండు రోజుల క్రితం అతడిని పర్ణశాల శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి బదిలీ చేశారు.
ఇదే విషయమై ఇక్కడున్న అర్చకులంతా వెళ్లి గురువారం ఉదయం ఈవోను కలిశారు. శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని శ్రీనివాస రామానుజాన్ని మళ్లీ భద్రాచలానికి రప్పించాలని కోరారు. ఇకపై అతడు అలాంటి తప్పిదాలకు పాల్పడకుండా తాము పర్యవేక్షిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు లేఖ కూడా రాసి ఈవోను విజ్ఞప్తి చేశారు. ఉప ప్రధాన అర్చకుడు లేకుండా శ్రీరామనవమి వంటి పెద్ద మహోత్సవాన్ని నిర్వహించడం కష్టతరమే అవుతుందని వివరించారు. ఆలయ కైంకర్యాలు చేయడానికి అతడిని అనుమతించాలని కోరారు.
శ్రీరామనవమి వేడుకలు ముగిసిన తరువాత అతడిని బదిలీ చేసినా తమకు అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. కానీ సాయంత్రం వరకూ ఈవో నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తాము అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించలేమంటూ అర్చకులు భీష్మించారు. ఈ విషయంలో అర్చకులకు, ఈవోకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు కిందిస్థాయి ఉద్యోగులు రాత్రి వరకూ చేసిన చర్చలు విఫలమమైనట్టు తెలుస్తున్నది. అంకురార్పణ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రామయ్య దర్శనానికి వచ్చిన భక్తులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.
ఎట్టకేలకు రాత్రి పది గంటల సమయంలో ఈ వివాదం సద్దుమణిగింది. ఈవో రమాదేవి అర్చకుల వద్దకు వెళ్లి చర్చించారు. ఉప ప్రధాన అర్చకుడు తప్పిదానికి పాల్పడినప్పటికీ అర్చకులు అతడిని వెనుకేసుకొని రావడం ద్వారా ఆలయ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉప ప్రధాన అర్చకుడు లేకుండా వేడుకలు జరపలేమని అర్చకులు తేల్చిచెప్పారు. ఎట్టకేలకు ఉప ప్రధాన అర్చకుడిని ఈవో పిలిపించారు. రాత్రి పది గంటల సమయంలో అతడు అంకురార్పణ చేయడంతో నవమి వేడుకలు ప్రారంభమయ్యాయి.