హైదరాబాద్, డిసెంబర్ 9: దేశంలోనే తొలిసారి ఆల్కాహాల్ చాలెంజింగ్ ఎలర్జీ టెస్ట్, లిక్కర్ స్కిన్ టెస్ట్ నిర్వహించారు ప్రముఖ వైద్యుడు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్. మద్యం తాగినప్పుడల్లా చర్మంపై దద్దుర్లు, శ్వాస ఇబ్బందులు తదితర లక్షణాలతో బాధపడుతున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ (50)కు హైదరాబాద్‌లోని తన అశ్విని ఎలర్జీ సెంటర్లో ఈ పరీక్షలు నిర్వహించి రోగిని కాపాడారు.
ఉదయ్‌పూర్‌కు చెందిన బాధితుడికి మద్యం సేవించే అలవాటు ఉన్నదని, అయితే ఆల్కాహాల్ తాగినప్పుడల్లా చర్మవ్యాధులకు గురయ్యేవాడని, ఆస్తమా బారినపడ్డారని డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ తెలిపారు. ఢిల్లీలోని ప్రముఖ దవాఖానల్లో చికిత్స ఇప్పించి, ఆల్కాహాల్ డీ అడిక్షన్ ఇప్పించినా ఫలితం లేకపోయిందని వెల్లడించారు. చివరికి అతడిని తన వద్దకు తీసుకురాగా, వివిధ రకాల చర్మ పరీక్షలు నిర్వహించి సీరం ఐజీఈ ఎలర్జీ తీవ్రంగా ఉన్నట్టు గుర్తించానని వివరించారు.
మద్యం అలవాటు ఉన్నందున అతడికి అత్యంత కీలకమైన 3 రకాల ఆల్కాహాల్ ఎలర్జీ టెస్టులు నిర్వహించామని తెలిపారు. 30 ఎంఎల్ లిక్కర్ తాగించి గంటసేపు పరీక్షించగా, బాధితుడిలో పలు చర్మవ్యాధుల లక్షణాలు కనిపించాయని చెప్పారు. దాంతో అత్యవసర చికిత్స అందించి ఎలర్జీని నియంత్రించామని వివరించారు. ఇలా ఒక బాధితుడికి ఆల్కాహాల్ ఎలర్జీ సంబంధిత పరీక్షలు నిర్వహించటం దేశంలోనే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు.