Chemical cocktail | వాషింగ్టన్, జూలై 16: వయసు పెరిగినా శరీరం యవ్వనంగా కనిపిస్తే బాగుండు! అని ఎంతో మంది కోరుకుంటారు. దీన్ని సాధ్యం చేసేందుకు శాస్త్రవేత్తలు ఏండ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ దిశగా హార్వర్డ్ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. వయసును తగ్గించే(రివర్స్ చేసే) కెమికల్ కాక్టెయిల్స్ను అభివృద్ధి చేశామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అధ్యయన వివరాలు తాజాగా ఏజింగ్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ‘జీన్ థెరపీ’ ద్వారా వయసును తగ్గించొచ్చని ఇదివరకు కనుగొన్నామని, తాజాగా కెమికల్ కాక్టెయిల్ ద్వారా కూడా ఇది సాధ్యపడుతుందని గుర్తించామని, ఇది శరీరాన్ని పునర్ యవ్వనంగా మార్చడంలో కీలక అడుగు అని హార్వర్డ్ శాస్త్రవేత్త డేవిడ్ సిన్‌క్లయిర్ ట్విట్టర్లో వెల్లడించారు. కణాల వయసును తగ్గించి, వాటిని పునరుజ్జీవంపజేసే మాలిక్యూల్స్‌ను కనుగొనేందుకు మూడేండ్ల పాటు శ్రమించామని తెలిపారు. కోతులు, ఎలుకల మెదడు కణజాలాలు, కిడ్నీలు, కండరాలపై చేసిన అధ్యయనాల్లో అశాజనక ఫలితాలు వచ్చాయని, వచ్చే ఏడాది మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని తెలిపారు.