హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు వందకుపైగా క్రిమినల్ కేసుల్లో పాత్ర ఉందని, పీడీ యాక్ట్ కింద 12 నెలలపాటు జైల్లో ఉంచేందుకు వీలుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. తన భర్తపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించడాన్ని సవాల్ చేస్తూ రాజాసింగ్ భార్య ఉషాభాయ్ ఇటీవల దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై జస్టిస్ ఏ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ జే శ్రీదేవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
రాజాసింగ్ మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, ప్రభుత్వం జీవో 90 జారీ చేసిందని ప్రత్యేక న్యాయవాది సదాశివుని ముజీబ్ కుమార్ కోర్టుకు తెలిపారు. పోలీసులు సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేసినట్లు చెప్పారు. పీడీ యాక్ట్ కింద అరెస్టయిన రాజాసింగ్‌ను విడుదల చేయాల్సిన అవసరం లేదని, రిట్ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు.
అయితే, జీవో 90ని సవాల్ చేస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేసేందుకు గడువు కావాలని ఉషాభాయ్ తరఫున మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు కోర్టును కోరారు. దాంతో న్యాయస్థానం విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.