హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : ఇటీవల పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకంగా ఉన్నాయని, ప్రజాస్వామ్యవాదులను అర్బన్ నక్సలైట్లుగా చిత్రీకరించేలా ఆయన మాట్లాడారని జస్టిస్ రజినీ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తదితరులపై అర్బన్ నక్సల్స్ అని చేసిన వ్యాఖ్యలపై శనివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ రజినీ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలోని పోకడలు చూస్తుంటే.. చనిపోయే స్థితిలో ఉన్న మనుషులు కూడా ఆందోళన చేయాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఆర్టికల్ 121 ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను అభిశంసించే సమయంలో తప్ప, వారి తీర్పులపై పార్లమెంట్లో చర్చించే అధికారం ఉండదని తెలిపారు. న్యాయ వ్యవస్థను బలహీనపర్చడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని నేలమట్టం చేయాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారని అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. ఒక జడ్జి ఇచ్చిన తీర్పు ఆయన వ్యక్తిగత రాజకీయాలకు ముడిపెడుతూ మాట్లాడటం అనైతికమన్నారు. రాజకీయ వ్యవస్థ నుంచి న్యాయవ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
సుదర్శన్‌రెడ్డిపై అమిత్‌షా వ్యాఖ్యలు భవిష్యత్ భారత ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. రాజకీయవ్యవస్థ నుంచి న్యాయవ్యవస్థను కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చిందని మానవ హకుల నాయకుడు జీవన్‌కుమార్ తన అభిప్రాయం వ్యక్తంచేశారు. సీనియర్ జర్నలిస్ట్, మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. అమిత్‌షా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిపై వ్యాఖ్యలు చేయడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
సురేశ్‌కుమార్ మాట్లాడుతూ.. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఇచ్చిన తీర్పు ప్రజలపై ప్రభుత్వ బాధ్యతను గుర్తింపజేసిందని, అరాచకంగా మనుషులను చంపడాన్ని వ్యతిరేకించిందని అభిప్రాయపడ్డారు. జీ రాములు మాట్లాడుతూ.. ఈ సందర్భం ఒక రాజకీయ ప్రత్యామ్నాయంపై సమాజానికి, ప్రజలకు భరోసా కల్పించడం అభ్యుదయ, ప్రగతిశీల, వామపక్షశక్తుల బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వక్తలు మలుపు బాల్‌రెడ్డి, కార్తీక్ నవయాన్, నందిగం కృష్ణారావు, మురళి, అన్వర్‌ఖాన్, వనమాల, అనీజ్, డేవిడ్, నరసింహారావు, వేణుగోపాల్, మహదేవన్, నవీన్సౌదా, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.