Telangana | వరంగల్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఇంట్లోకి కుక్క చొరబడిందని ఓ వ్యక్తి ఏకంగా పోలీసులకే ఫోన్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో డయల్ 100కు కాల్ చేసి కుక్కను వెళ్లగొట్టేందుకు సాయం కావాలని కోరాడు.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌కు చెందిన కొండపర్తి రాజేంద్రకుమార్ అనే వ్యక్తి స్టేషన్ రోడ్డులోని పోస్టాఫీసు సమీపంలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అతని ఇంట్లోకి కుక్క చొరబడింది. దీంతో కంగారు పడిపోయిన రాజేంద్రకుమార్ వెంటనే 100కు కాల్ చేశాడు. వెంటనే తమ ఇంటికి రావాలని రిక్వెస్ట్ చేశాడు. దీంతో ఇంతెజార్గంజ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ రాజయ్య అక్కడకు వెళ్లాడు. ఇంత అర్ధరాత్రి ఎందుకు ఫోన్ చేశావని అడగ్గా.. కుక్కను బయటకు వెళ్లగొట్టడానికి సహాయం కావాలని ఫోన్ చేశానని రాజేంద్రకుమార్ బదులిచ్చాడు. దీంతో కానిస్టేబుల్ రాజయ్య ఒక్కసారిగా షాకయ్యాడు. ఆ తర్వాత తేరుకుని కుక్కను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. అనంతరం ఇలాంటి చిన్న చిన్న విషయాలకు 100కు డయల్ చేయొద్దని మందలించాడు.