హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌కు లబ్ధి చేకూర్చేలా గోదావరి, కృష్ణాకు సంబంధించి మొత్తం 7 రివర్ లింక్ ప్రాజెక్టులను నేషనల్ పెర్స్పెక్టివ్ ప్లాన్ (ఎన్పీపీ)కి ప్రతిపాదించామని కేంద్ర జల్‌శక్తి శాఖ వెల్లడించింది. ప్రస్తుతం అవి ఏ దశల్లో ఉన్నాయో పార్లమెంట్‌కు నివేదించింది. ఏపీకి సం బంధించి ఎన్ని రివర్ లింక్ ప్రాజెక్టులకు ఎన్పీపీకి ప్రతిపాదించారని, అవి ఏ దశ ల్లో ఉన్నాయని ఏపీ ఎంపీ అప్పలనాయుడు లోక్‌సభలో ప్రశ్నించడంతో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టునే కాకుండానే ఏపీ భాగస్వామిగా మరో 7 లింక్ ప్రాజెక్టులను చేపడుతున్నట్టు వెల్లడించారు.
ఎన్పీపీ కింద ఇప్పటికే గోదావరి (పోలవరం)-కృష్ణా (విజయవాడ) లింక్ ప్రాజెక్టును చేపట్టామని, రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హో దా కల్పించామని స్పష్టం చేశారు. మహానది (మణిభద్ర)-గోదావరి (ధవళేశ్వరం) లింక్, మహానది (బార్ముల్)-రుషికుల్య-గోదావరి (ధవళేశ్వరం) లింక్, పోలవరం-విజయవాడ లింక్, గోదావరి (ఇచ్చంపల్లి)-సీతమ్మసాగర్-పులిచింతల లింక్, నాగార్జునసాగర్-సోమశిల లింక్, శ్రీశైలం-సోమశిల లింక్, ఆల్మట్టి-సోమశిల లింక్, సోమశిల-కావేరి లింక్ ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఉన్నట్టు వివరించారు. ఇప్పటికే వీటిలో కొన్నింటికి ప్రీ-ఫీజబులిటీ రిపోర్టులు, మరికొన్నింటికి డీపీఆర్‌లు సిద్ధమైనట్టు తెలిపారు.